Chandrababu : తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం తప్పింది. కోనసీమ జిల్లా సోoపల్లి వద్ద చంద్రబాబు ప్రయాణిస్తున్న బోటు ర్యాంపు తెగిపోయి ప్రమాదం చోటుచేసుకుంది. సోoపల్లి వద్ద చంద్రబాబుతో పంటు దిగేందుకు ఒక్కసారిగా పంటు చివర ర్యాంపు వద్దకు నేతలందరు ఒక్కసారిగా చేరుకున్నారు. చంద్రబాబును ముందుగా పంటు నుంచి నాటు పడవ ఎక్కించారు భద్రతా సిబ్బంది. వేరొక నాటు పడవ ఎక్కేందుకు టీడీపీ నేతలందరూ ర్యాంపు మీదకి రావటంతో బరువు ర్యాంపు రెక్క విరిగిపోయింది. దీంతో మాజీ మంత్రులు దేవినేని ఉమా, పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు, ఎమ్మెల్యే రామరాజు, నేతలు కలవపూడి శివ, తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ, చంద్రబాబు ఎన్ఎస్జీ సిబ్బంది, మీడియా ప్రతినిధులు నీటిలో పడిపోయారు. నీటిలో మునిగి ఊపిరాడక కొద్దిసేపు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వెంటనే లైఫ్ జాకెట్లు వేసిన సిబ్బంది వారిని కాపాడారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఒడ్డుకు సమీపంలోనే ప్రమాదం జరగడంతో ప్రాణాపాయం తప్పింది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం పర్యటిస్తున్నారు. కోడేరులో వశిష్ట గోదావరి నదిపై చంద్రబాబు బోటులో ప్రయాణించారు. అయోధ్యలంక, మర్రిమూల, నక్కిలంక, పుచ్చలలంక, రాయలంకల్లో ఆయన బోటులో పర్యటించారు. వరద బాధితులను చంద్రబాబు పరామర్శిస్తున్నారు. సాయంత్రం రాజోలు, పాలకొల్లులో పర్యటించి రాత్రికి అక్కడే స్టే చేయనున్నారు. శుక్రవారం యలమంచిలి మండలం దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, గంగాధరపాలెం, లక్ష్మీపురం, పొన్నపల్లి గోదావరి గట్టు, నర్సాపురం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఐదు నియోజక వర్గాలు ఆచంట, పి.గన్నవరం, రాజోల్, పాలకొల్లు, నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వరద ముంపు గ్రామాల్లో టీడీపీ అధినేత పర్యటించనున్నారు.
దెబ్బతిన్న ఇళ్లకు రూ.50 ఇవ్వాలి- చంద్రబాబు
పశ్చిమగోదావరి జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. కోడేరులో వశిష్టగోదావరి నదిపై చంద్రబాబు, టీడీపీ నేతలు బోట్‌లో ప్రయాణించారు. బాధితుల వద్దకు స్వయంగా వెళ్లి చంద్రబాబు పరామర్శించారు. వరదల కారణంగా జరిగిన నష్టాన్ని టీడీపీ నేతలు, బాధితులు చంద్రబాబుకు వివరించారు. కలుషిత నీరు ఇస్తున్నారని గ్రామస్థులు చంద్రబాబు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ముంపు బాధితులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు ఆరోపించారు. వరద బాధితుల కష్టాలు బాధిస్తున్నాయన్న ఆయన ప్రజలను బురదలో ముంచేసి సీఎం గాల్లో తిరుగుతున్నారని ఆరోపించారు. వరద బాధితులకు తెలంగాణలో రూ.10 వేలు ఇస్తున్నారని, వైసీపీకి ఎందుకివ్వట్లేదని ప్రశ్నించారు. వరదల్లో దెబ్బతిన్న ఇళ్లకు రూ.50 వేలు చొప్పున ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.