Chandrababu Tour : కోనసీమలో వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. వరద బాధితులను పరామర్శిస్తున్నారు. అయితే చంద్రబాబు పర్యటనలో పిక్ పాకెటర్స్ చేతివాటం చూపారు. చంద్రబాబు వెంట నడిచిన నాయకుల పర్సులు కొట్టేశారు కేటుగాళ్లు. రాజోలులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరద ముంపు ప్రాంతాల పర్యటనలో దొంగలు టీడీపీ నేతల జేబులు కట్ చేశారు. సోంపల్లిలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పర్సును దొంగలు కొట్టేశారు. పర్సులో  రూ.35 వేలు నగదు, రెండు ఏటీఎం కార్డులు ఉన్నట్లు ఆయన తెలిపారు. అలాగే మరో ఇరవై మంది వరకు పర్సులు పోగొట్టుకున్నట్లు సమాచారం. పర్సు అపహరణపై మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు రాజోలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


పర్యటన ఆలస్యంతో


పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాజోలు నియోజకవర్గంలోనికి ప్రవేశించిన చంద్రబాబు పర్యటన ఆలస్యం అయింది. శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు వస్తారనుకున్న చంద్రబాబు సాయంత్రం 5 గంటలకు చేరుకున్నారు. దీంతో ప్రోగ్రామ్ అంతా హడావిడిగా మారింది. సోంపల్లి తదితర ప్రాంతాలలో గందరగోల పరిస్థితి నెలకొంది. చంద్రబాబు వెంట నడిచిన నాయకులతో పాటు కార్యకర్తలు, స్థానికులతో ఆ ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోగా ఇదే అదనుగా పిక్ పాకెటర్స్ చెలరేగిపోయారు.


లబోదిబోమంటున్న నేతలు 


జేబు దొంగలు ఎక్కువగా నాయకులనే టార్గెట్ చేసుకున్నారు. అందులో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావుతోబాటు పలువురు నాయకులు, కార్యకర్తలు బాధితుల్లో ఉన్నారు. వీరిలో అధిక మొత్తం పోగొట్టుకున్న మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు రాజోలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.