Kodi Kathi Case Telugu News: కోడి కత్తి శీను... రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు. 2018లో ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై కోడి కత్తితో శీను దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించడం తెలిసిందే. ఆ దాడిపై సానుభూతితోనే జగన్ సీఎం అయ్యారనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఆ తర్వాత శీను ఐదేళ్లపాటు జైల్లో ఉన్నాడు. చివరకు 2024 ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఏపీ హైకోర్టు అనుమతితో బెయిల్ పై విడుదలయ్యారు.


బెయిల్ రద్దుకు ఒప్పుకోని సుప్రీంకోర్టు  
 శీనుకు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కేసును విచారిస్తున్న ఎన్‌ఐఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఎన్ఐఏ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై జోక్యం చేసుకోకూడదని నిర్ణయించింది. కోడికత్తి శీను బెయిల్‌ను రద్దు చేయలేమని స్పష్టం చేశారు. దీంతో ఈ కేసులో ఎన్‌ఐఏ టార్గెట్‌గా మారింది. ఇది ఇలా ఉండగా, 2024 ఎన్నికలకు ముందు శీను జై భీమ్ భారత్ పార్టీలో చేరారు. పేదల అభివృద్ధి, సంక్షేమం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని శీను తెలిపారు. కులతత్వం కోసం తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. మరోవైపు ఈ కేసులో జగన్ ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదు. సీఎం హోదాలో బిజీగా ఉన్న జగన్ విచారణకు హాజరు కాలేకపోతున్నారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. అలాగే ప్రతిపక్ష నేతగా కూడా లేని జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఖాళీగా ఉన్నందున విచారణకు హాజరవుతారా లేక మరేదైనా కారణంతో యధావిధిగా కోర్టుకు గైర్హాజరవుతారా అనేది చూడాలి.


అసలేం జరిగిందంటే..
 2018 అక్టోబర్ 25న విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై శ్రీనివాస్ కోడి కత్తితో దాడి చేశాడు. ఆ దాడిలో జగన్ ఎడమ భుజానికి గాయమైంది.  జగన్ విజయనగరంలో పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ వెళ్లేందుకు అని విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో ఈ దాడి జరిగింది. విశాఖ ఎయిర్‌పోర్టు క్యాంటీన్‌లో పనిచేస్తున్న జనుపెళ్ల శ్రీనువాసరావు సెల్ఫీ దిగేందుకు వైఎస్‌ జగన్‌ వద్దకు వెళ్లి కత్తితో దాడి చేశాడు. ఘటన అనంతరం జగన్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ సిఫారసు మేరకు కేసును జనవరి 1, 2019న ఎన్ఐఏకి బదిలీ చేశారు. అదే ఏడాది మే 28న నిందితుడికి బెయిల్ మంజూరైంది.


అయితే, ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఎన్‌ఐఏ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించడంతో.. బెయిల్‌ను రద్దు చేసింది. రెండు నెలల తర్వాత ఆగస్టు 13న నిందితుడు మళ్లీ జైలుకు వెళ్లాడు. అప్పటి నుంచి శ్రీనివాస్ జైల్లోనే ఉన్నాడు. రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీనివాసరావును 2023 సెప్టెంబర్ 6న విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. శ్రీను బెయిల్ పిటిషన్ ను విచారించిన ఏపీ హై కోర్టు జనవరి 24న తీర్పును రిజర్వ్ లో పెట్టి, ఫిబ్రవరి 8న బెయిల్ మంజూరు చేసింది. 
 
టీడీపీ ఆఫీస్ పై దాడి కేసు  
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆరుగురు నిందితులకు గుంటూరు జిల్లా కోర్టు బెయిల్‌ నిరాకరించింది. నిందితుల బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. అనారోగ్య కారణాలతో గిరి రాంబాబు అనే వ్యక్తికి మాత్రం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.  2021 అక్టోబరు 19న వైసీపీకి చెందిన కొందరు టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాడ్లతో చెలరేగిన పోయిన అల్లరి మూక ఆఫీసులోని ఫర్నీచర్‌తో ఆఫీసు అద్దాలు, కార్లను ధ్వంసం చేస్తూ రెచ్చిపోయారు. అయితే ఈ దాడి వెనుక వైసీపీకి చెందిన దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు ఉన్నట్లు అప్పట్లో టీడీపీ నేతలు ఆరోపించారు.