Kodali Nani started politics again in Gudivada: మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడ రాజకీయాల్లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. సుదీర్ఘ విరామం తర్వాత క్రియాశీల రాజకీయ కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. గతంలో కోర్టు వాయిదాలకు.. ముందస్తు బెయిల్ షరతుల్లో భాగంగా పోలీస్ స్టేషన్లలో సంతకాలు పెట్టడానికి వచ్చి వెళ్లిపోయేవారు. కానీ ఈ సారి రాజకీయ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నాని, గవర్నర్‌కు అందించే వినతిపత్రంలో సంతకం చేశారు. ఆ తర్వాత, వినతి పత్రాలను జిల్లా కమిటీకి అందించే పార్టీ శ్రేణుల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ శ్రేణులతో కొడాలి నాని మాట్లాడారు. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు వైద్య విద్య అందాలనే మంచి సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు పునాదులు వేశారని కొడాలి నాని తెలిపారు. వైసీపీ పాలనలో ఐదు కళాశాలలు పూర్తి అయ్యాయన్నారు. మరో ఐదు కళాశాలల నిర్మాణం తుది దశకు చేరుకున్నాయని కానీ వాటిని పూర్తి చేయలేదన్నారు. పేద ప్రజలు, విద్యార్థులకు ఉపయోగపడే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, హాస్పిటల్స్ ప్రైవేటీకరణ దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రను అడ్డుకోవాలంటే మాజీ సీఎం జగన్ ప్రజలతో కలిసి పోరాటాన్ని మొదలుపెట్టారని కొడాలి వివరించారు.
తమ ఉద్యమానికి ప్రజల నుంచి చక్కటి స్పందన వచ్చిందని కొడాలి నాని ప్రకటించారు. ప్రజల విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాభిష్టానికి అనుకూలంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఉద్యమంలో తమ సేకరించిన వినతి పత్రాలను వైసీపీ అధినేత జగన్ నాయకత్వంలో గవర్నర్‌కు అందజేయనున్నట్లు మాజీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. కొడాలి నాని ప్రభుత్వం మారగానే తీవ్ర సమస్యలు ఎదుర్కొంటారని అనుకున్నారు. కానీ ఆయన గుడివాడకు రాకుండా ఉండటంతో పాటు గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరి ఆపరేషన్ చేయించుకున్నారు. ముంబైలో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. దీంతో ఆయన కోలుకోవడానికి సమయం పట్టింది. రెడ్ బుక్ లో మొదటి పేరు కొడాలి నానితే ఉంటుందని టీడీపీ వర్గాలు చెబుతూ ఉంటాయి. ఆయన వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల పాటు విపరీతమైన భాషను ఉపయోగించేవారు. ఇప్పుడు ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉండటంతో..టీడీపీ క్యాడర్ కూడా రెడ్ బుక్ మళ్లీ రెడీ అవుతుందని నమ్ముతున్నారు .