ఆంధ్రప్రదేశ్‌లో జన ఆశీర్వాద్ యాత్ర చేస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తలకు గాయం అయింది.  కారు ఎక్కుతుండగా డోర్ బలంగా తగిలింది.దీంతో నుదుటిపై రక్తం వచ్చేలా దెబ్బతగిలింది. జన ఆశీర్వాద సభ ముగించుకుని వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దెబ్బ తగిలిన సమయంలో బాధలో విలవిల్లాడిపోవడంతో ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు. ఆ తర్వాత కోదాడకు బయలుదేరారు. హైకమాండ్ ఆదేశం మేరకు తెలుగు రాష్ట్రాల్లో కిషన్ రెడ్డి జన ఆశీర్వాద్ యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా ఉదయం విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్నారు.  తెలంగాణలోని నల్లబండగూడెం నుంచి జన ఆశీర్వాదయాత్ర చేస్తారు. కోదాడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే ఆయన సభను వాయిదా వేసుకునే అవకాశం ఉంది.
 



గాయం అయిన తర్వాతనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. అధికార పర్యటనకు విజయవాడ వచ్చిన కిషన్ రెడ్డిని సీఎం జగన్ తన నివాసానికి రావాలని ఆహ్వానించారు. సాదరంగా స్వాగతం పలికిన.. అనంతరం కిషన్ రెడ్డితో కలిసి జగన్ భోజనం చేశారు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం మంత్రి వెల్లంపల్లితో కలిసి సీఎం నివాసానికి వచ్చారు కిషన్ రెడ్డి. భేటీ అయిన తర్వాత సీఎం జగన్ మర్యాదపూర్వకంగానే ఆహ్వానించారని.. ఇందులో రాజకీయం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలుగువాడికి పూర్తి స్థాయి కేబినెట్ మంత్రిగా కేంద్రంలో అవకాశం రావడంతోనే తేనేటి విందుకు ఆహ్వానించారని తెలిపారు. కనకదుర్గమ్మ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తన వంతు సహకారం అందిస్తామన్నారు. ఏపీ, తెలంగాణ నరేంద్రమోడీకి రెండు కళ్లులాంటివని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 
 


ఆంధ్రప్రదేశ్‌ నుంచి కేంద్రమంత్రి వర్గంలో ఎవరికీ ప్రాతినిధ్యం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరే కేంద్ర మంత్రి ఉన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ హైకమాండ్ కూడా తెలంగాణతో పాటు ఏపీలోనూ బీజేపీని బలపరిచే  బాధ్యత కిషన్ రెడ్డికే అప్పగించింది. కొత్త మంత్రులందరితో వారి వారి రాష్ట్రాల్లో జన ఆశీర్వాద్ యాత్రలు చేయిస్తోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కిషన్ రెడ్డి యాత్ర చేస్తున్నారు. తెలంగాణలో మూజు రోజుల పాటు జన ఆశీర్వాద్ యాత్ర సాగనుంది. అయితే  ఏపీలో యాత్ర ప్రారంభించిన తొలి రోజే తలకు గాయం కావడంతో కిషన్ రెడ్డి అనుచరులు ఆందోళన చెందుతున్నారు. నదుటికి బలమైన గాయమే అయిందని జన ఆశీర్వాద్ యాత్రను వాయిదా వేసుకుని ..  ఆస్పత్రికి వెళితే బాగుంటుందని అనుచరులు సూచించారు. అయితే కిషన్ రెడ్డి యాత్ర కొనసాగించడానికే ఆసక్తి చూపించినట్లుగా తెలుస్తోంది.