Andhra Pradesh Minister Parthasarathi:  ఏపీ కేబినెట్ బుధవారం కీలక తీర్మానాలు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరిగింది. దాదాపు మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  అక్టోబర్‌ 1వ తేదీ నుంచి నూతన మద్యం పాలసీ (New Excise Policy) అమలులోకి తీసుకురానున్నట్లు మంత్రి పొలుసు పార్థసారథి (Minister Parthasarathi) విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. అల్పదాయ వర్గాలకు నాణ్యమైన మద్యాన్ని అందుబాటులో ధరలకు అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. 2019-24 కాలంలో వైఎస్‌ జగన్‌ అమలు చేసిన మద్యం పాలసీ వల్ల ఏపీకి రూ.18,860 కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. మావోయిస్టులపై ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పొడిగిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. 


రాజముద్ర, క్యూఆర్‌తో కూడిన పట్టా పుస్తకం
జగన్ బొమ్మతో ఉన్న పట్టాదార్ పాస్ బుక్ లను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరిగి క్యూఆర్ కోడ్ తో కూడిన పట్టా పాస్ పుస్తకాలు ఇస్తామని ప్రకటించారు. పట్టాపుస్తకంపై జగన్‌ ఫోటో బదులు రాజముద్ర ముద్రించి అందజేయాలని సమావేశం తీర్మానించిందన్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు రానున్న మూడు నెలల పాటు రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.  



పడిపోతున్న ఏపీ జనాభా
దేశంలో ఫర్టిలిటీ రేటు పడిపోతుందని.. ఏపీలోనూ సంతానోత్పత్తి రేటు తగ్గుదల అంశంపై చర్చ జరిగిందని మంత్రి పేర్కొన్నారు. దేశంలో సంతాన సాఫల్య రేటు తగ్గిపోతోందని చాలా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయన్నారు. ప్రపంచ గణాంకాలను, జాతీయ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే.. రాష్ట్రంలో సంతాన సామర్థ్య రేటు తక్కువగా ఉందని మంత్రి పార్థసారథి తెలిపారు. జాతీయ స్థాయిలో సంతానోత్పత్తి సామర్థ్య రేటు 2.1 గా ఉంటే, అది ఏపీలో 1.5గా ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో జనాభా నిర్వహణ పట్ల ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఏపీలో యువ జనాభా తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో సంతానోత్పత్తి  రేటు తగ్గిపోతోందన్న గణాంకాలను కూడా నేటి కేబినెట్ సమావేశంలో చర్చించామన్నారు. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్న వారు మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనరాదని గతంలో చేసిన చట్ట సవరణల రద్దుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కూడా ఇటువంటి నిబంధనే ఉంది. దీన్ని కూడా ఎత్తివేసేందుకు నిర్ణయించామని మంత్రి వివరించారు.   


రూ.700కోట్లు దుబారా
నేటి కేబినెట్ సమావేశంలో భూముల రీసర్వేపై రెవెన్యూ శాఖ నోట్ సమర్పించింది. రీ సర్వే వల్ల ఉత్పన్నమైన వివాదాలపై కేబినెట్ చర్చించింది. జగన్ బొమ్మ, పేరు ఉన్న సర్వే రాళ్లను ఏం చేయాలనే అంశంపై చర్చ జరిగింది. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు తొలగించాలని మంత్రులు సూచించారు. బొమ్మల పిచ్చితో గత ముఖ్యమంత్రి జగన్ రూ.700 కోట్లు దుబారా చేశారని మంత్రులు విమర్శించారు. రీ సర్వేతో భూ యజమానుల్లో ఆందోళనలు పెరిగి, గ్రామాల్లో వివాదాలు తలెత్తుతున్నాయని మంత్రి తెలిపారు. 


మెడికల్‌ కాలేజీల్లో పోస్టుల పెంపునకు గ్రీన్‌ సిగ్నల్‌
మెడికల్‌ కాలేజీల్లో ఫేజ్‌ -1 కింద విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం , నంద్యాలలో మెడికల్‌ కళాశాలకు మంజూరైన సీట్లు పెంచాలని , గతంలో మంజూరైన పోస్టులకు అదనంగా మరో 380 పోస్టుల భర్తీ చేయాలని సమావేశం నిర్ణయించిందని తెలిపారు. ఫేజ్‌ -2 కింద పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లెలో నిర్మించిన నూతన కళాశాలలో వంద సీట్లతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్‌ తో ప్రారంభించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు.  గుజరాత్‌లో ఉన్న పీపీపీ మోడల్‌ను అధ్యయనం చేయాలని సీఎం సంబంధిత శాఖల మంత్రులు, అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 


జీవో 40 రద్దు 
 జీవో నంబర్‌ 40 రద్దు కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మే 11, 2023న జారీ చేసిన జీవో 40 ప్రకారం నంద్యాల జిల్లా సున్నిపెంట గ్రామ పంచాయతీకి కేటాయించిన 280 ఎకరాల భూమిని రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానించింది. దాన్ని తిరిగి నీటిపారుదల శాఖకు బదలాయించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ భూమిని అన్ని చట్టాలను పరిగణనలోకి తీసుకొని శ్రీశైలం దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌కు వినియోగించుకోవాలని కేబినెట్ సూచించింది. నెల్లూరు జిల్లాలో 25,360 హెక్టార్లలో చేపల చెరువులను బహిరంగ వేలానికి అనుమతి ఇస్తూ గత ప్రభుత్వం రెండు జీవోలు తీసుకొచ్చింది. ఆ రెండు జీవోలను రద్దు చేయాలని ఈ భేటీలో నిర్ణయించామని, గతంలో ఉన్న మాదిరే మత్స్యకార సహకార సొసైటీలకు నామమాత్రపు లీజుతో చెరువులను కేటాయిస్తామని మంత్రి పార్థసారథి వివరించారు.