Pawan OSD Krishna Teja :  జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆయన తన టీమ్‌ను ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నారు. కేరళ క్యాడర్ తెలుగు ఐఏఎస్ అధికారి కృష్ణతేజను డిప్యూటేషన్‌పై ఏపీకి రప్పించి ఆయనను ఓఎస్డీగా నియమించుకునే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కృష్ణ తేజ ఇప్పటికే పవన్ ను కలిశారు. చంద్రబాబు కూడా కృష్ణతేజ అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ పరంగా ఆయనను ఏపీకి డిప్యూటేషన్ పై  తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 


గత వారం ఐఏఎస్ అధికారి కృష్ణతేజను జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ అవార్డు వరించింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆయనను ప్రత్యేకంగా ప్రశంసించారు. కృష్ణతేజ ప్రస్తుతం కేరళలోని త్రిస్సూర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. బాలల హక్కుల రక్షణలో త్రిస్సూర్ జిల్లా దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. దీని వెనుక జిల్లా కలెక్టర్ కృష్ణతేజ కృషి ఎంతో ఉంది. త్వరలోనే ఆయన ఈ పురస్కారం అందుకోనున్నారు. 


కేరళలో సమర్థుడైన అధికారిగా కృష్ణ తేజకు గుర్తింపు               


కృష్ణతేజ ఎంతో సమర్థుడైన అధికారిగా గుర్తింపు పొందారు. కేరళలో వరదలు ప్రళయం సృష్టించిన సమయంలో ఆయన చూపించిన చొరవ జాతీయ స్థాయిలో ఆకట్టుకుంది. ఆ సమయంలో కృష్ణతేజ అలెప్పీ జిల్లా సబ్ కలెక్టర్ గా ఉన్నారు.  ఆ తర్వాత కాలంలో ఆయనను కేరళ పర్యాటక శాఖ డైరెక్టర్ గా నియమించారు. అనంతరం త్రిస్సూర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు అందుకున్నారు.


పవన్ ఓఎస్డీగా నియమించుకునే అవకాశం                   


 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన  కృష్ణ తేజ కేరళ రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తూ ప్రజా సంక్షేమం, పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని పవన్ భావిస్తున్నారు.   కృష్ణ తేజ విధి నిర్వహణలో చూపిన అంకిత భావాన్ని పవన్ ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు.  ఆయన తన విధినిర్వహణలో ప్రజలకు మరింతగా సేవలు అందిస్తూ ఉద్యోగులకు, యువతకు స్ఫూర్తినిస్తున్నాయని అంటున్నారు. డిప్యూటీ సీఎంగా తన బాధ్యతల విషయంలో కృష్ణతేజ అనుభవం ఉపయోగపడుతుందని పవన్ కల్యాణ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. 


సెక్రటేరియట్‌కు వచ్చిన కృష్ణతేజ                  


పవన్ కల్యాణ్ , చంద్రబాబును కలిసేందుకు వచ్చిన సమయంలో సచివాలయానికి వచ్చారు. అప్పుడే డిప్యూటేషన్ పై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సీఎంవో కోసం ఇద్దరు, ముగ్గురు ఐఏఎస్ అధికారుల్ని డిప్యూటేషన్ పై తీసుకు వచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. వారితో పాటు కృష్ణతేజను కూడా పిలిపించే అవకాశం ఉంది.