Breaking News Live: మద్యం మత్తులో యువకులు వీరంగం, ఇనుపరాడ్లతో వాహనాలపై దాడి 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 20 Feb 2022 10:06 PM
మద్యం మత్తులో యువకులు వీరంగం, ఇనుపరాడ్లతో వాహనాలపై దాడి 

గుంటూరు జిల్లా తెనాలి రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు యువకులు మద్యంమత్తులో హల్ చల్ చేశారు. కోటి నాగయ్య ఆసుపత్రి వద్ద రోడ్డుపై వాహనాలు రాకపోకలను అడ్డుకుని ఇనుపరాడ్లతో వాహనాల అద్దాలు పగలగొట్టారు. యువకుల వీరంగంతో అరగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.  పోలీసులు వారిని అడ్డుకోగా పోలీసులపై చేయి చేసుకుని కాలర్ పట్టుకున్నారు. సహనం కోల్పోయిన పోలీసులు యువకులపై లాఠీచార్జ్ చేశారు. యువకులకు చెందిన ప్రైవేట్ స్థల వివాదంలో కోర్టులో కేసు నడుస్తోంది. తీర్పు వాళ్లకు అనుకూలంగా రాదేమోనన్న అనుమానంతో వీరంగం సృష్టించినట్లు తెలుస్తోంది.  

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు ఐఎన్ఎస్ డేగ లో ఘన స్వాగతం

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు ఐఎన్ఎస్ డేగ లో ఘన స్వాగతం 


విశాఖపట్నం:  ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ సందర్భంగా రాష్ట్రానికి చేరుకున్న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు ఘన స్వాగతం పలికారు. ఆదివారం విశాఖపట్నంలో నేవీ విమానాశ్రయం ఐఎన్ఎస్ డేగ కు సాయంత్రం గంటలు 5.35 నిమిషాలకు ఆయన చేరుకున్నారు. స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్,  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి), నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర, ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున, AVSM, YSM, VSM, ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్ చీఫ్, తూర్పు నౌకాదళ కమాండ్, విశాఖపట్నం, వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్‌గుప్తా, రాజ్యసభ సభ్యులు, ప్రభుత్వ ప్రతినిధి వి. విజయ సాయి రెడ్డి, పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ,  తదితరులు పాల్గొన్నారు.

KCR Meets Sharad Pawar: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ముంబైలో పర్యటిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమైన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ విధానాలు, దేశంలో ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చించారు. సాయంత్రం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. శరద్ పవార్ నివాసంలో పవార్‌తో పాటు ఆయన కుమార్తె సుప్రియా సూలే భేటీలో పాల్గొన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయమిదని, దేశాభివృద్ధికి అవసరమైన కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం.

KCR Reaches Mumbai: కేసీఆర్‌కు ముంబయిలో ప్రకాశ్ రాజ్ ఘన స్వాగతం

ముంబయి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీమ్‌కు హయత్ గ్రాండ్ హోటల్‌లో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఘన స్వాగతం పలికారు. హయత్ గ్రాండ్ హోటల్ నుంచి కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికారిక నివాసానికి బయలుదేరి వెళ్లారు.

KCR In Mumbai: ముంబయికి చేరుకున్న సీఎం కేసీఆర్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి చర్చలు జరిపేందుకు ముంబయి పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ కాసేపటి క్రితమే అక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ఉద్ధవ్ నివాసానికి బయలుదేరారు. కాసేపట్లో వారిద్దరూ భేటీ అయి, జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. ఎలా ప్రజా కూటమిని ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై మాట్లాడుకోనున్నారు. కేసీఆర్ వెంట కేకే, కవిత, రంజిత్ రెడ్డి, సంతోష్ కుమార్, బీబీ పాటిల్ తదితరులు ఉన్నారు.

Telangana CM KCR: మరికాసేపట్లో ముంబై చేరుకోనున్న తెలంగాణ సీఎం కేసీఆర్

Telangana CM KCR Will Reach Mumbai Soon: ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన తెలంగాణ సీఎం కేసీఆర్ మరికాసేపట్లో ముంబై చేరుకుకోనున్నారు. నేటి మధ్యాహ్నం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రెతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ కానున్నారు. కేంద్ర ప్రభుత్వంపై తాను చేస్తున్న పోరాటానికి మహారాష్ట్ర సీఎంను మద్దతు కోరతారు. సీఎం కేసీఆర్ వెంట ఎంపీలు సంతోష్, రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డి ముంబైకి వెళ్లారు.

Pawan Kalyan: రాజమహేంద్రవరంలో పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం

Pawan Kalyan Reached Rajamahendravaram: రాజమహేంద్రవరం విమానాశ్రయం చేరుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రావులపాలెం, సిద్ధాంతం, పాలకొల్లు మీద పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించే మత్స్యకార అభ్యున్నతి సభ వేదికకు చేరుకుంటారు.

Constable Suicide: హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌ ఆత్మహత్య

హైదరాబాద్‌ నగరంలో ఓ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మహేశ్వరం పోలీస్‌ స్టేషన్‌లో తేజావత్‌ రాజు కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. నాచారం పీఎస్‌ పరిధి సింగం చెరువు తండాలోని తన నివాసంలో ఉరి వేసుకుని కానిస్టేబుల్‌ బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే, ప్రేమ వ్యవహారమే ఈ ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.

Anantapur Accident: అనంతపురంలో ఘోర ప్రమాదం

అనంతపురం జిల్లా, నల్లమడ మండలం పులగం పల్లి వద్ద మినీ బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 15 మందికి గాయాలు అయ్యాయి. పులగం పల్లికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తి కుటుంబం తిరుమలకి తలనీలాలు సమర్పించుకుని స్వామి వారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులు మాట్లాడుతూ.. బస్సులో 32 మంది ప్రయాణిస్తున్నామని దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో కారు అడ్డం రావడంతో బ్రేకు పడలేదని.. అందుకే వాహనం అదుపుతప్పి బస్సు బోల్తా పడింది అని తెలిపారు. ఈ ప్రమాదంలో బాగదమ్మ, చలపతి భార్య భర్తలు, ఈశ్వర్ అనే వ్యక్తి ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. క్షతగాత్రులకు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Background

ఏపీ, తెలంగాణలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో తూర్పు, ఆగ్నేయ దిశ గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకూ ఎలాంటి వర్షం ఉండబోదని వెల్లడించారు. అలాగే వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేశారు.


ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. కనిష్ణ ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.


‘‘2022 జనవరి గత 200 సంవత్సరాల్లోనే అత్యంత వేడైన జనవరి. ప్రపంచ వ్యాప్తంగా సాధారణ ఉష్ణోగ్రత కంటే 1.45 డిగ్రీలు అధికంగా నమోదయ్యింది. 1980 తర్వాత భూతాపం, అధిక ఉష్ణోగ్రతలు ఎక్కువైయ్యాయి. అలా చూస్తే ఈ సారి జనవరి నెల ఉష్ణోగ్రతలు ఎక్కువనే చెప్పుకోవచ్చు. ఇప్పుడే ఇలా ఉంటే ఒక 200 సంవత్సరాల తర్వాత ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయో ఒక్క సారి ఊహించుకోగలరు.’’  అని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ వెల్లడించారు.


తెలంగాణలో ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రమంతా ఎలాంటి వర్ష సూచన లేదు. వాతావరణం అంతా పొడిగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితే మరో మూడు నాలుగు రోజులు ఉండనుందని అంచనా వేశారు.


తెలంగాణలో ఆకాశం పాక్షింగా మేఘాలతో ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీలుగా, గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటలకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. రాష్ట్రంలో నిన్న కొన్ని జిల్లాల్లో చిరు జల్లులు కురిశాయి. అయినా కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి.


బంగారం, వెండి ధరలు


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు బాగా తగ్గింది. గ్రాముకు రూ.30 చొప్పున తగ్గింది. వెండి ధర కూడా కిలోకు రూ.1,400 పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.46,000 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.50,190 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.1400 పెరిగి రూ.70,000కు చేరింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,190గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.70,000 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.46,000 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.50,190గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.70,000గా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.