Kalva Srinivasulu: కృష్ణా జలాల పున:పంపిణీపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోరు ఎందుకు మెదపడం లేదని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. కృష్ణా జలాల పున:పంపిణీ పై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోట్ జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మాయ మాటలతో మభ్య పెట్టడం తప్ప, రైతులకు, ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు.  స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను జగన్ తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. 


మిగులు జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. కేంద్రం నిర్ణయంతో రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పున:సమీక్ష చేసే వరకు, రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు అందరూ కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రం ఇప్పటికే అప్పర్ భద్రకు నిధులు కేటాయించిందని, ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సమయంలో కృష్ణాజలాల నీటి వాటాను మార్పు చేసేందుకు నిర్ణయం తీసుకుందని విమర్శించారు.


నీటి పంపిణీలకు సంబంధించిన విషయాలు కోర్టులకు వెళ్తే త్వరగా తెగవని కాల్వ శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజల కోసం కేంద్రాన్ని ఎదిరించాల్సిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్రానికి, రాయలసీమకు ఇంత అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రి జగన్, మంత్రులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. రాయలసీమ ప్రాంతానికి న్యాయం జరిగేలా అందరూ కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ త్వరలో దీనిపై ప్రణాళిక ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజలే టీడీపీ ప్రధాన లక్ష్యమన్నారు.


మిగులు జలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌కు స్వేచ్చ ఉంటుందని, అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వాటిపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. దీనిపై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ఊర్లలో పంచాయతీలు చేసినా ఇంత అన్యాయంగా పంచరు కదా అని అడిగారు. ప్రజలు, రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు స్పందించడం కనీస బాధ్యత అని, కానీ అధికార  పార్టీ నేతలు ఎవరూ మాట్లాడడం లేదన్నారు. పార్లమెంట్ చేసిన చట్టానికి భిన్నంగా కేంద్ర జల సంఘం చేసిన సిఫార్సు రాయలసీమకు గొడ్డలి పెట్టులాంటిదని నేతలు మండిపడ్డారు. రాష్ట్రం ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి తక్షణం వాటిని అధికారిక ప్రాజెక్టులుగా ప్రకటించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 


గోదావరి నీటిని కృష్ణ డెల్టా అందించడం ద్వారా ఆదా అయ్యే కృష్ణా జలాలను రాయలసీమకు అందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. రెండేళ్లుగా పూర్తిగా నిలిచిపోయిన హాంద్రీనీవా ప్రాజెక్టు పనులను 2022 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో అలసత్వం వహిస్తే చూస్తూ ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హెచ్‌ఎల్‌సీకి నీరు రాలేదన్నా.. దిగువ తుంగకు నిధుల కేటాయింపులు, కృష్ణా జలలా పంపిణీ పున:సమీక్షించే అంశాలు అన్నీ మసి పూసి మారేడు కాయలు చేసేందుకు పాలకులు చేస్తున్న దుష్ట పన్నాగాలు అన్నారు. ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు జరుగతున్న అన్యాయంపై పెద్దలు, మేధావులు  మాట్లాడాలని అన్నారు.