Kakinada Tiger Fear : కాకినాడ జిల్లాలో పెద్దపులి చిక్కడు, దొరకడు మాదిరిగా మారింది. రాయల్ బెంగాల్ టైగర్ ను పట్టుకునేందుకు అటవీ అధికారులు, పోలీసులు ఎత్తులు వేస్తుంటే వారికి చుక్కలు చూపిస్తూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. రోజుల క్రితం ఎస్.పైడిపాల ఆవులపై ఎటాక్ చేసిన పెద్దపులి జాడను కనుక్కునేందుకు దాడిచేసి చంపిన ఆవు కళేబరం వద్ద దాదాపు 15 ట్రాక్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అధికారులు. అయితే అది చూసేందుకు వెళ్లిన అధికారులకు అక్కడ పులి సగం తిని వదిలేసిన ఆవు కళేబరం మరికొంత దూరంలో కనిపించింది.
టక్కరి టైగర్
కచ్చితంగా పులి వచ్చి ఇంకో చోటుకు లాక్కెళ్లింది కాబట్టి సీసీ కెమెరాల్లో పులి కదలికలు కచ్చితంగా రికార్డు అయ్యి ఉంటుందని భావించారు. తీరా రికార్డయిన దృశ్యాలను చూసిన అధికారులకు టక్కరి టైగర్ పెద్ద షాకే ఇచ్చింది. 15 కెమెరాల్లో ఒక్క కెమెరాల్లో పులి చిక్కలేదు. ఇదేలా సాధ్యమయ్యింది అంటూ తలలు పట్టుకుని పాద ముద్రలను వెతికితే వేరే మార్గంలో వచ్చిన పులి సీసీ కెమెరాలకు చిక్కకుండా ఆవు కళేబరాన్ని లాక్కెళ్లి దూరంగా కూర్చుని తిన్నట్లు గుర్తించారు అటవీశాఖ అధికారులు. సీసీ కెమెరాలు కేవలం అడుగు ఎత్తులోనే పెట్టాల్సి ఉందని ఏదో వస్తువుగా గమనించి వాటి దగ్గరకు కాదు కదా కనీసం ఎదురుగా కూడా పులి రాలేదని చెబుతున్నారు.
ఎస్.పైడిపాలలోనే మకాం
రౌతులపూడి మండలం ఎస్. పైడిపాల గ్రామ సమీపంలో రిజర్వ్ ఫారెస్ట్ ను అనుకొని ఉన్న దట్టమైన సరుగుడు, జామాయిల్ తోటల్లో తిష్ట వేసింది పెద్దపులి. అధికారులు ఎత్తులు వేస్తే నేనేమైనా తక్కువ అంటూ పైఎత్తులు వేస్తూ తప్పించుకుంటుంది బెంగాల్ టైగర్. పెద్దపులి జాడ కోసం అటవీ శాఖ అధికారులు జల్లెడ పట్టారు. అయితే అధికారులు వెళ్లిన సమయానికి ఒక గంట ముందు పక్కనే ఉన్న కాలువ వద్ద పులి పాదముద్రలు కనిపించాయి. దీంతో అధికారులు గ్రామాన్ని ఆనుకుని ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ లోనే పులి సంచరిస్తుందని నిర్ధారించారు.
నెల రోజులుగా ముప్పతిప్పలు
నెల రోజుల పాటు ప్రత్తిపాడు, శంఖవరం, ఏలేశ్వరం మండలాల పరిధిలోని దాడులు చేసిన పెద్ద పులి రౌతులపూడి మండలం ఎస్. పైడిపాల గ్రామ పరిధిలోనే సరుగుడు, జామాయిలు తోటల్లో పశువులపై పంజా విసిరింది. ప్రస్తుతం ఎస్. పైడి పాల గ్రామ పరిధిలోని దట్టమైన తోటల్లో పాగా వేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. శంఖవరం మండల పరిధిలోని తాడువాయి, పెద్దమల్లపురం పరిసర ప్రాంతాల్లో ఆవులపై దాడి చేసిన తరువాత పులి రిజర్వు ఫారెస్ట్ లోకి వెళ్లిపోయిందని అధికారులు చెప్పారు. అయితే సమీప మండలమైన రౌతులపూడి మండల పరిధిలోని ఎస్ పైడిపాల గ్రామ పరిధిలోకి వచ్చే పశువులపై దాడి చేసి ఒక ఆవును కబళించింది. తాజా పులి కదలికలను బట్టి పులి వచ్చిన మార్గాన్నే తిరిగి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుందని దానికి సమీపంలో కనిపించిన పశువులపై దాడి చేసిందని అధికారులు చెబుతున్నారు.