Gollala Mamidada Srirama Navami : తెలుగు రాష్ట్రాలలో రెండో భద్రాద్రిగా పేరుగాంచిన కాకినాడ జిల్లా గొల్లల మామిడాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రాముని కల్యాణ మహోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. గత రెండేళ్లుగా కోవిడ్ కారణంగా సీతారాముల కల్యాణం ఏకాంతంగా నిర్వహించారు. ఈ సంవత్సరం చలువ పందిళ్ల నడుమ శ్రీరాముని భక్తుల కోలాహలంగా కల్యాణం నిర్వహించేలా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. 


1889 నాటి ఆలయం 


కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గంలో పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో వేంచేసిన కోదండరామచంద్రమూర్తి ఆలయం తెలుగు రాష్ట్రాల్లో రెండో భద్రాద్రిగా ప్రసిద్ధి చెందింది. 1889లో ఇక్కడ స్వామి వారు స్వయంభూగా వెలిశారని భక్తులు సీతా మహాలక్ష్మి, శ్రీరామచంద్రమూర్తి అను పేర్లతో కొలలను ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. అప్పటి నుంచి స్వామివారు భక్తుల పూజలను కొలల రూపంలోనే అందుకుంటూ వస్తున్నారు. గ్రామానికి చెందిన ద్వారంపూడి సుబ్బిరెడ్డి, రామిరెడ్డి సోదరులు స్వామివారికి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పం చేశారు. ఆలయ నిర్మాణంతో పాటు తూర్పున తొమ్మిది అంతస్థుల గోపురాన్ని 160 అడుగుల ఎత్తులో నిర్మాణం పూర్తి చేశారు. తరువాత క్రమంలో వాస్తు ప్రకారం పడమరన ఎత్తు ఉండాలని 1956లో పశ్చిమాన 200 అడుగుల ఎత్తులో 11 అంతుస్తుల గోపురాలను నిర్మించారు. ఈ గోపురాలపై ఆనాటి రామాయణం, భాగవతాలకు చెందిన అంశాలను శిల్పులు కండ్లకు కట్టినట్టుగా రూపొందించారు. 


అద్దాల మందిరంలో వింత అనుభూతి  


గోపురాలపై ఉన్న శిల్ప కళా సంపదను తిలకించేందుకు రెండు కనులు చాలవని భక్తులు పేర్కొనడం విశేషం. నాటి నుంచి నేటి వరకు ప్రతి ఏటా స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తూ స్వామిని కొలుస్తున్నారు. తరువాత కాల క్రమంలో నిర్మించిన అద్దాల మందిరం మాయా ప్రపంచాన్ని తలపిస్తుంది. ఇక్కడ అద్దాల మందిరంలో ప్రవేశించిన భక్తులు వింత అనుభూతికి లోనవుతారు. ఐదు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా ఏకాంతంగా స్వామివారి కల్యాణం జరుపుతున్నారు. కరోనా తగ్గు ముఖం పట్టడంతో స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు ఈ సంవత్సరం భక్తులను అనుమతించనున్నారు. 



పట్టువస్త్రాలు సమర్పించనున్న కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే 


కల్యాణం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రభుత్వం తరపున కాకినాడ జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్ల, అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి దంపతులు స్వామివారికి నూతన పట్టు వస్త్రాలను  సమర్పించనున్నారు. స్వామి వారి కల్యాణంలో ఉపయోగించేందుకు  తలంబ్రాలను శాస్త్ర యుక్తంగా గ్రామానికి చెందిన ద్వారంపూడి యువ రాజా రెడ్డి గత 13 సంవత్సరాలుగా స్వయంగా ఉదయం సాయంత్రం పూజ అనంతరం చేతులతో ఒకేసారి 8 బియ్యం గింజలపై శ్రీరామ, శ్రీరామ అని రాసి స్వామివారికి సమర్పించడం గత 13 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం లక్ష బియ్యపు గింజలపై స్వామివారి పేరును మూడు భాషలలో రాసి ఆలయానికి అందజేసినట్లు ద్వారంపూడి యువ రాజారెడ్డి తెలిపారు. తలంబ్రాలతో పాటు స్వామివారి కల్యాణంలో వినియోగించే కొబ్బరి బొండాంలపై శంకు చక్రాలు, స్వామివారి మూల విరాట్ ను రంగులతో తీర్చిదిద్దినట్లు తెలిపారు.