Nirmala Seetharaman :ట్రేడ్ హబ్‌గా కాకినాడ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక ప్రాత్ర పోషించనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. శుక్రవారం ఉదయం కాకినాడ జేఎన్‌టీయూలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐఐఎఫ్‌టీ క్యాంపస్‌ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. జేఎన్‌టీయూ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ... ఎగుమతి సామర్థ్యాలతో ఏపీ ప్రాముఖ్యత చాటుకుందన్నారు. విదేశీ వాణిజ్యానికి హబ్ గా నిలుస్తున్న కాకినాడలో ఐఐఎఫ్‌టీ ఏర్పాటు ఎంతో కీలకం అన్నారు. సుమారు 700 కి.మీటర్ల తీర రేఖ ఉన్న ఏపీలో ఎగుమతి అవకాశాలను ఈ ప్రాంత ఎంటర్ ప్రెన్యూర్లు అందిపుచ్చుకున్నారన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విదేశీ వాణిజ్యంలో రాష్ట్రాన్ని ముందు వరసలో నిలిపారని ప్రశసించారు. అలాగే ఫార్మాస్యూటికల్స్, ఆటో, టెక్స్‌టైల్, రైస్, రైస్ బ్రాన్ ఆయిల్, పళ్లు, కూరగాయల వాణిజ్యానికి ఏపీలో అపార సామర్థ్యం ఉందన్నారు.
వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడెక్ట్ విధానం
రాష్ట్రాలు తమ ఉత్పత్తులకు అంతర్జాతీయ ఎగుమతి అవకాశాలను విస్తరించుకునేందుకు విదేశీ ఎంబసీలలో ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ ఆఫీసుల ఏర్పాటుకు ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారని నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. దేశంలోని పలు రాష్ట్రాలు యూరోపియన్ దేశాల కంటే వైశాల్యం పరంగా పెద్దవి అని గుర్తుచేశారు. వాటిలో ఒక్కొక్క జిల్లా, ఒక్కో విశిష్ట ఉత్పత్తికి కేంద్రంగా ఉందన్నారు. ఈ ఉత్పత్తులకు ప్రోత్సాహాలను కల్పించేందుకే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడెక్ట్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. అలాగే ఎన్నో స్థానిక ఉత్పత్తులు అంతర్జాతీయ ఆదరణ పొందుతున్నాయని తెలిపారు. వాటి ఎగుమతుల ప్రోత్సాహనికి రాష్ట్రాలు ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. ఐ.ఐ.ఎఫ్.టి విద్యార్థులు తమ కోర్సును కేవలం అకడమిక్ డిగ్రీ సాధనలా కాకుండా ప్రపంచ వాణిజ్య స్థితిగతులు, సదవకాశాలను అధ్యయనం చేస్తూ విధాన రూపకల్పనల్లో కేంద్ర వాణిజ్య శాఖకు సూచనలు అందించాలని కోరారు. దేశ ఆర్థిక పురోగతిలో నిర్మాణాత్మక భాగస్వాములు కావాలని నిర్మలా సీతారామన్ కోరారు. దిల్లీలోని క్యాంపస్, బ్రిటీష్ ప్రెసిడెన్సీలో కొనసాగిన కలకత్తాలోని క్యాంపస్‌ల కన్నా ఐ.ఐ.ఎఫ్.టి. కాకినాడ క్యాంపస్ భిన్నమైనదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం అభివృద్ధే లక్ష్యంగా కేంద్రం ప్రభుత్వం చొరవతో ఎయిమ్స్, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, ఎన్ఐడీ, ఐఐఎఫ్‌టీ, ఐఐపీ వంటి పది ప్రతిష్టాత్మక సంస్థలను కేంద్రం ఏపీలో ఏర్పాటుచేస్తోందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
సమిష్టి కృషితో ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ ప్రత్యేక చొరవతో కాకినాడలో ఐఐఎఫ్‌టీ క్యాంపస్ ఏర్పాటైందన్నారు. ఈ క్యాంపస్ ఏర్పాటు సరికొత్త అధ్యాయానికి నాంది పలికిందని, భారతీయ వాణిజ్యానికి భవిష్యత్తులో అంతర్జాతీయ గుర్తింపు రావాలంటే నిపుణులైన మానవ వనరులు అవసరమని పేర్కొన్నారు. ఈ మానవ వనరులు ఐఐఎఫ్‌టీల ద్వారా అందుబాటులోకి రానున్నాయన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ 3.5 ట్రిలియన్ అమెరికా డాలర్లుగా ఉందని, వచ్చే 25 ఏళ్లలో ఈ ఆర్థిక వ్యవస్థను పది రెట్లు పెంచేలా కృషి చేస్తున్నామన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ప్రత్యేక బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం, చేశాయన్నారు. సమ్మిళిత ఆర్థిక వృద్ధి, సమష్టి కృషితో అభివృద్ధి చెందుతున్న దేశాన్ని అభివృద్ధి చెందిన దేశం స్థాయికి తీసుకెళ్లొచ్చన్నారు. ఏపీ వ్యవసాయం, మత్స్య తదితర రంగాల్లో ఎంతో వృద్ధి సాధిస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఉన్నాయన్నారు. నిపుణులైన మానవ వనరులను అందుబాటులోకి తేవడం ద్వారా మరింత అభివృద్ధిని సాధించొచ్చన్నారు.