Sunitha Reddy responds over CM Jagan comments: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చిన్న పిల్లోడని.. అతనిపై పెద్ద పెద్దోళ్లంతా కుట్ర చేసి జీవితం నాశనం చేయాలని చూస్తున్నారని సీఎం జగన్ అన్న వ్యాఖ్యలపై వివేకా కుమార్తె సునీతా రెడ్డి స్పందించారు. వైఎస్ అవినాష్ చిన్న పిల్లోడు అయితే.. అతణ్ని స్కూలుకు పంపుకోవాలని, పెద్ద పెద్ద పదవులు అప్పగించొద్దని ఎద్దేవా చేశారు. సీరియస్ అయిన ఎంపీ పదవులు చిన్న పిల్లలకు ఇవ్వరని అన్నారు. సునీతా రెడ్డి పులివెందులలో గురువారం (ఏప్రిల్ 25) ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై రాయి దాడి జరిగాక అయిన గాయానికి బ్యాండేజ్ వేసి ఎక్కువ రోజులు అవుతుందని, దాన్ని వెంటనే తీసేయాలని అన్నారు. ఎక్కువ రోజులు బ్యాండేజ్ ఉంటే సెప్టిక్ అవుతుందని సునీత అన్నారు. డాక్టర్లు సరైన సలహా ఇవ్వలేదని.. జగన్ త్వరగా బ్యాండేజ్ తీయాలని ఒక డాక్టర్‌గా సలహా ఇస్తున్నట్టు ఎద్దేవా చేశారు. గాలి తగిలితేనే గాయం త్వరగా తగ్గుతుందని అన్నారు.
పులివెందులలో నామినేషన్ వేసిన సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో వివేకానంద రెడ్డిపై ద్వేషం కనిపిస్తోందని అన్నారు. ఏం పాపం చేశారని ఆయనపై మీకు ఇంత విద్వేషం అని సునీత నిలదీశారు. జగన్ సీఎం కావడం కోసం తన పదవులను త్యాగం చేశారు కాబట్టి.. వివేకాపై కోపమా? అని ప్రశ్నించారు. సీఎం జగన్‌కు న్యాయ వ్యవస్థ, సీబీఐపై నమ్మకం లేదని అన్నారు. మరి ఆయనకు ఏ వ్యవస్థపై నమ్మకం ఉందో చెప్పాలని నిలదీశారు. వివేకా హత్య గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడవద్దని కోర్టు ఆర్డర్ తెచ్చుకున్న వాళ్లే ఇప్పుడు బహిరంగంగా మాట్లాడుతున్నారని జగన్ ను ఉద్దేశించి అన్నారు.
సీబీఐ నిందితులు అని చెప్పిన వాళ్లకు ఓట్లు వేయవద్దని.. తప్పు చేసి ఉంటే తనకైనా, తన భర్తకైనా శిక్ష పడాల్సిందే అని అన్నారు. అవినాష్ రెడ్డి చిన్న పిల్లోడని చెబుతున్నారని.. సీబీఐ నిందితుడు అన్న వాళ్లను జగన్ ఎందుకు ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఐదేళ్లుగా తన తండ్రి హత్యపై తాను పోరాడుతుంటే తనపై రాజకీయాలు అంటగడుతున్నారని అన్నారు. తన హత్యపై పోరాటానికి సహాయం చేయండని సునీతా రెడ్డి విజ్ఞప్తి చేశారు.