KA Paul Comments On Pawan Kalyan: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పవన్ కల్యాణ్ లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ గత పదేళ్లలో 9 పార్టీలతో కలిశారని, ఆయన రాజకీయాలకు పనికిరారని ఎద్దేవా చేశారు. అందుకే ఆయన్ను ఎవరు నమ్మటం లేదని, వీవీ లక్ష్మీనారాయణ వంటి వారు కూడా ఆయనను విడిచిపెట్టేశారని అన్నారు. పవన్ కల్యాణ్ యాక్టర్‌గా ఉండిపోయి ఇంట్లోనే ఉండిపోవాలని, చిత్తశుద్ధి ఉంటే తన ధర్నాకు మద్దతు ఇవ్వాలని కోరారు. 


పునర్విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను అమలు చేయకుండా కేంద్రం చేస్తున్న మోసానికి నిరసనగా తాను ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బుధవారం (జూలై 20) ధర్నా చేస్తానని కేఏ పాల్ చెప్పారు. అంతేకాక, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌, టీడీపీ చీఫ్ చంద్రబాబును కూడా కోరారు. మద్దతు కోరుతూనే వారిపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కేఏ పాల్ విలేకరులతో మాట్లాడారు.


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన క్లౌడ్‌ బరస్ట్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి సిగ్గులేని కామెంట్స్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రధాని అవుతారనే విదేశీయులు ఈ కుట్ర చేశారని, అందులో భాగంగానే క్లౌడ్ బరస్ట్ జరిగిందని కేసీఆర్ కామెంట్స్ చేశారని ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో కూడా పారాసిటమాల్ వేసుకోవాలని తేలిగ్గా కేసీఆర్ చెప్పడం వల్ల ఎంతో మంది చనిపోయారని గుర్తు చేశారు.


కేంద్ర ప్రభుత్వంతోపాటు తెలుగు రాష్ట్రాలు చేస్తున్న అప్పుల వల్ల దేశం త్వరలోనే శ్రీలంక, వెనిజువెలా మారడం ఖాయమని కేఏ పాల్ విమర్శించారు. హైదరాబాద్‌లో తాను గ్లోబల్ సమ్మిట్ పెడతానంటే దానిని గుజరాత్‌లో పెట్టాలంటూ బీజేపీ నేతలు తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పారు. ఆగస్టు 15వ తేదీలోగా పునర్విభజన చట్టంలోని హామీలు నెరవేర్చకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు.


నాకు స్పెషల్ పర్మిషన్లు ఇవ్వలేదు - పాల్
ప్రపంచంలో ఎక్కడ విపత్తులు సంభవించినా సహాయం చేయడంలో తాను ఎప్పుడూ ముందుంటానని కేఏ పాల్ గుర్తు చేసుకున్నారు. భారత్‌లో వివిధ రాష్ట్రాల్లో వస్తున్న వరదల్లో సాయం చేయాలంటే తనకు తగిన పర్మిషన్లు లేవని చెప్పారు. ఎక్విప్‌మెంట్‌ను తన ఫ్లైట్‌లో రానివ్వడం లేదని, తన ఎఫ్‌సీఆర్ఏను ఓపెన్ చేయనివ్వలేదని, హ్యామానిటేరియన్ ఎయిడ్ విదేశాల నుంచి తేవడానికి స్పెషల్ పర్మిషన్ ఇవ్వనందువల్ల ఇక్కడ ఆదుకోలేకపోతున్నామని చెప్పుకొచ్చారు.