KA Paul made a fuss near CM Jagan  house  : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటికి వచ్చారు.  తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు కేఏ పాల్. కానీ ఆయనకు అపాయింట్‌మెంట్ లేదు. అపాయింట్ మెంట్ లేదనందున  భద్రతా సిబ్బంది లోపలికి పంపలేదు.    క్యాంపు కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతించలేదు పోలీసులు.  పోలీసులు అడ్డుకోవడంతో సీఎం క్యాంపు కార్యాలయం వెళ్లే రోడ్డు మెయిన్ గేట్ వద్ద కారు ఆపి కాసేపు హంగామాచేశారు. 
 
మీడియా ముందు తాను సీఎం వైఎస్‌ జగన్ ను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వచ్చినట్టు తెలిపారు. ప్రజా సమస్యలపై సీఎంతో చర్చించి ఎన్నికల్లో కలసి పనిచేద్దామని చెప్పేందుకు వచ్చినట్టు వెల్లడించారు. అంతేకాదు.. సీఎం వైఎస్‌ జగన్‌ అపాయింట్‌మెంట్ ఈ రోజంతా వేచి చూస్తానన్నారు.. అపాయింట్ మెంట్ ఇస్తే దీవిస్తా.. లేదంటే శపిస్తాను అని వ్యాఖ్యానించారు కేఏ పాల్‌. 


అంతకుముందు ఏపీ పర్యటనలో ఉన్న సీఈసీ రాజీవ్ కుమార్‌ను కలిసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పలు సూచనలు చేశారు.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చివరి దశలో పెట్టాలని కోరాను అన్నారు.. అంతేకాదు.. పోలింగ్‌ రోజే రిజల్ట్ కూడా ప్రకటించాలని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.. కోవిడ్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు అవసరం అన్నారు. మరోవైపు.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్‌ చేశారు పాల్.. కాపులందరూ బయటకు రావాలని పిలుపునిచ్చారు.. పవన్ కల్యాణ్‌కి నా పర్సనల్ రిక్వెస్ట్.. వంగవీటి రంగాని చంపిన పార్టీతో కలవద్దు అని సూచించారు కేఏ పాల్.


కేఏ పాల్ ఇటీవల మరీ వింతగా ప్రవర్తిస్తున్నారు. మూడు రోజుల కిందట సైంధవ్ సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు. ఆ ఫంక్షన్ కు ఆయనను ఎవరూ పిలవలేదు. అయినా వెళ్లి .. తాను లోపలికి వెళ్తానని గొడవ పెట్టుకున్నారు. ఎవరూ ఆయనను లోపలకు పంపలేదు. అంతకు ముందు తనపై విష ప్రయోగం జరిగిందని పది రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నానని మీడియాకు సమాచారం ఇచ్చారు. రెండు రోజుల్లోనే ఆయన బయటకు వచ్చారు. మరో వైపు ప్రతీ రోజూ.. ప్రెస్ మీట్లు పెట్టి..ఆయన చేసే ప్రకటనలు వైరల్ అవుతున్నాయి. తనతో కలిసి వస్తే ముఖ్యమంత్రిని.. ప్రధానమంత్రుల్ని చేస్తానని చెబుతూ ఉంటారు. ఆయన తీరు రోజు రోజుకు వింతగా మారుతోంది.                                                                                     


కేఏ పాల్ మాట్లాడితే కామెడీగా ఉంటుందని మీడియా ప్రతినిధులు.. యూట్యూబ్ చానళ్లు కూడా ఆయన కనిపిస్తే.. మాట్లాడించేందుకు ప్రయత్నిస్తున్నాయి.