AP BJP :   ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకత్వం ప్రజల్లోకి బాగా వెళ్తోందని.. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా .. ఏపీ బీజేపీ నాయకత్వాన్ని అభినందించారు.  2024 ఎన్నికలే లక్ష్యంగా  రెండు రోజులుగా దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో దేశంలోని అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, సంఘటన ప్రధాన కార్యదర్శులు, జాతీయ పదధికారులు, కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా పాల్గొన్నారు. సమావేశంలో ఇటీవల నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ సమావేశాలు,    నిర్వహించిన తీరు , ప్రజలలో స్పందన , కార్యకర్తలు, నాయకులు అనుభవం తదితర అంశాలపై సోము వీర్రాజు గారికి మాట్లాడటానికి అవకాశమిచ్చారు.  


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను గురించి, కేంద్రంలోని నరేంద్రమోదీ గారి ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేకూరిన లబ్ధిని గురించి వివరిస్తూ అక్టోబర్ నెలలో 15 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన 6,500 వీధి సమావేశలో పార్టీ జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్ద పెద్ద బహిరంగసభలు పెడితే.. నేరుగా ప్రజల్ని పార్టీ కార్యకర్తల్ని కలవడానికి అవకాశం ఉండదు కానీ.. ఇలా వీధి సమావేశాలు పెట్టడం వల్ల అట్టడుగు స్థాయి ఓటర్నీ కూడా నేరుగా కలుసుకునే చాన్స్ ఉంటుందని... కేంద్రం అభివృద్ధి.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను బాగా ప్రచారం చేయడానికి ఉపయోగపడుతుందని ఏపీ నాయకత్వం వివరించింది. ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు చేరవేయడంలో ఈ వీధి సమావేశాలు బాగా ఉపయోగపడతాయని, ఈ విధానాన్ని దేశంలోని ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాలలో కూడా అమలు గురించి ఆలోచిస్తే బాగుంటుంది అని జేపీ నడ్డా.. అభిప్రాయపడ్డారు. 


ఏపీ బీజేపీ ప్రభుత్వంపై అలుపెరుగకుండా విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొదట ఉద్యోగాల భర్తీ మీద యువ ఆందోళన నిర్వహించారు. తరవాత ప్రజాపోరు పేరుతో గ్రామ, గ్రామాన.. వీధి వీధిన సమావేశాలు నిర్వహించారు. చిన్నవే అయినా ప్రజల్లో చొచ్చుకెళ్లే కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని భావిస్తున్న బీజేపీ తాము కూడా ప్రత్యామ్నాయమేనని ప్రజలకు సంకేతాలు పంపింది. ఇతర పార్టీలకు చాన్సిచ్చారని దేశ ప్రగతిలో పాలు పంచుకుంటున్న జాతీయ పార్టీగా..డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం తమకూ ఓ చాన్సివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. విష్ణువర్దన్ రెడ్డి నేతృత్వంలో సాగిన ప్రజాపోరు సభలతో మంచి మైలేజీ వచ్చిందని ఆ పార్టీ అభిప్రాయానికి వచ్చింది. ఇదే విషయం పార్టీ సమావేశాల్లో వెల్లడయింది. 


 భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో  నాయకులు అనేక అంశాలపై చాలా కూలంకుషంగా చర్చిస్తూ అందులో ప్రముఖంగా ఏపిలో నిర్వహించిన ప్రజా పోరు ( వీధిసభలు )పై సంతృప్తి వ్యక్తం చేసిన జాతీయ నాయకత్వం అభినందనలు తెలిపిందని ఈ ఉత్సాహంతో మరింతగా రెట్టించి పని చేస్తామని.. విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు.