Pawan Varahi Vijaya Yatra: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి విజయ యాత్రకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 21వ తేదీ నుంచి పవన్ నాలుగో విడత వారాహి యాత్ర చేపట్టనున్నారు. కృష్ణా జిల్లా నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. జిల్లాల్లో ఐదు రోజుల పాటు యాత్ర కొనసాగనుండగా.. నాలుగు నియోజకవర్గాలను జనసేనాని కవర్ చేయనున్నారు. యాత్రలో భాగంగా అవనిగడ్డ, పెడన, మచిలీపట్నం, కైకలూరు నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. 21న అవనిగడ్డ నుంచి యాత్ర ప్రారంభం కానుండగా.. 26వ తేదీ వరకు నాలుగు నియోజకవర్గాల్లో నిర్విరామంగా జరగనుంది.
నాలుగో విడత యాత్రలో భాగంగా మూడు బహిరంగ సభలు, రెండో ఇండోర్ మీటింగ్‌లు పవన్ నిర్వహించనున్నారు. అవనిగడ్డ, గుడివాడ, పెడన నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు జరపాలని జనసేన నిర్ణయం తీసుకుంది. ఈ యాత్రలో భాగంగా కృష్ణా జిల్లాల్లోని ప్రజల సమస్యలతో పాటు ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను లేవనెత్తనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఇవాళ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిణామలు, జనసేన కార్యాచరణపై నేతలతో చర్చించారు.
ఈ సమావేశంలో నాలుగో విడత వారాహి యాత్రపై చర్చించగా.. అనంతరం షెడ్యూల్‌ను జనసేన పార్టీ విడుదల చేసింది. పవన్ అధ్యక్షతన జరిగిన ఈ విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీతో పొత్తు గురించి నేతలకు పవన్ వివరించారు. టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుందనే విషయంపై శ్రేణులకు క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు అరెస్ట్‌తో పాటు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ నేతల అరెస్ట్‌ల గురించి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సమావేశం ముగిసిన అనంతరం పవన్ మాట్లాడుతూ.. 40 ఏళ్ల అనుభవం ఉన్న పార్టీ కూడా ఒడుదొడుకులు ఎదుర్కొంటుందని టీడీపీ గురించి ప్రస్తావించారు. సమస్యల మధ్య పార్టీని నడుపుతున్నామంటే అది రాజ్యాంగం ఇచ్చిన బలమేనని వ్యాఖ్యానించారు. రూల్ బుక్‌ను ప్రజలంతా గుర్తుంచుకోవాలని సూచించారు. ఇండియా, భారత్ పేర్లపై దేశమంతా చర్చించుకుంటున్నారని, ఇండియా దట్ ఈజ్ భారత్ అని రాజ్యాంగం మొదటి పేజీలోనే ఉందని తెలిపారు.
బ్రిటిష్ వారికి భారత్ అని నోరు తిరగక ఇండియా అని ఉండవచ్చని, తాను ఎప్పుడూ భారతీయుడిగానే మాట్లాడుతున్నానని పవన్ చెప్పారు. 380 మంది మేథోమథనం చేయడం వల్ల రాజ్యాంగం వచ్చిందన్నారు. సనాతన ధర్మం తనను తాను సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతుందన్నారు. అవసరాలు, పరిస్థితుల మేరకు సనాతన ధర్మం మారుతుందని, అందరినీ కలుపుకుపోవడం వల్లే దేశంలో ఏకత్వం నిలబడిందన్నారు. ద్వేషం, దోపిడీ ఎల్లకాలం ఉండదని, మార్పును అంగీకరించి ధర్మాన్ని పాటించినవారే దేశాన్ని నడపగలరని పేర్కొన్నారు.
అయితే ఉభయగోదావరి జిల్లాలో రెండు విడతలుగా వారాహి విజయయాత్ర చేపట్టగా.. మూడో విడత యాత్ర విశాఖపట్నంలో జరిగింది. ఇప్పుడు నాలుగో విడత యాత్రను కృష్ణా జిల్లాలో పవన్ నిర్వహిస్తున్నారు. వారాహి యాత్రలో వాలంటీర్లను పవన్ టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈ సారి యాత్రలో కూడా వాలంటీర్లను పవన్ టార్గెట్ చేస్తారా..? లేదా వ్యూహం మారుస్తారా? అనేది కీలకంగా మారింది.