Janasena Protest: తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో జనసేన నిర్వహించిన నిరసనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వాలంటీర్లుపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ.. వాలంటీర్లు వపన్‌ కళ్యాణ్‌ ఫొటోను చెప్పులతో కొట్టారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన జనసేన కార్యకర్తలు.. వాలంటీర్ల ఆందోళనను నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్‌ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, వీర మహిళలు పెద్ద ఎత్తున హాజరై నిరసన తెలిపారు. ఈ సందర్భంగానే ముఖ్యమంత్రి జగన్‌ దిష్టి బొమ్మను దగ్ధం చేయబోయారు. కానీ అప్పటికే ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకొని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈక్రమంలోనే తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 


పోలీసులు దిష్టిబొమ్మను లాగి పడేశారు. జనసేన నాయకులు మాత్రం ఆ దిష్టి బమ్మను లాక్కుని అంటించేందుకు తెగ ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఎంత చెప్పినా వినకపోవడంతో.. జనసేన పార్టీ నాయకులు రాజబాబు తదితరులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌ కి తరలించారు. కేవలం రాజుబాబును మాత్రమే కాకుండా మరికొంత మంది నాయకులను కూడా అరెస్ట్ చేశారు. దీనిని నిరసిస్తూ జన సైనికులు, వీర మహిళలు పోలీస్‌ స్టేషన్‌ ముందు బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.


అలాగే గుంటూరు జిల్లాలో కూడా తీవ్ర  ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబేద్కర్ కూడలిలో జనసేన కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఇక్కడ కూడా జనసైనికులు సీఎం దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నం చేయగా... తీవ్ర పెనుగులాట జరిగింది. 


వివాదం ఎలా ప్రారంభం అయిందంటే?



మరోవైపు ఏపీలో ఒంటరి మహిళల సమాచారం...  సంఘ విద్రోహ శక్తులకు చేర వేస్తున్నారని.. పవన్ కల్యాణ్ ఆరోపించడంతో వివాదం ప్రారంభమయింది.  వాలంటీర్లు సేకరించే అతి సున్నితమైన సమచారాన్ని ప్రభుత్వంలో పని చేసే కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపిస్తున్నారు.  అందర్నీ అనట్లేదు కానీ కొందరు వ్యక్తులు ఆడపిల్లలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.   కేంద్రంలోని చాలా పెద్ద స్థాయి నిఘా సంస్థల్లో పని చేసే వ్యక్తులు కూడా రాష్ట్రంలో ఆడపిల్లల అదృశ్యాలకి కొందరు రాజకీయ నాయకులకు సంబంధం ఉంది అని చెప్పారని అంటున్నారు.  అందుకే వాలంటీర్లకు సమాచారం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. సున్నితమైన సమాచారాన్ని ఇవ్వకండని ప్రజలకు పిలుపునచ్చారు.  ఈ విషయం చెప్పినందుకు నువ్వు నా మీద ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చని పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి సవాల్ చేశారు. 
 
ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు సమాచారం ఎలా తీసుకుంటారు ? 


వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు ప్రజల సమాచారం ఎలా తీసుకుంటారని పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తున్నారు.  ఒక MRO తప్పు చేస్తే పై అధికారికి కంప్లైంట్ చేయచ్చు మరి వాలంటీర్లు తప్పు చేస్తే ఎవరికి చెప్పాలి?  వాలంటీర్లకు ప్రజల డబ్బుతో జీతాలు ఇస్తున్నారు. ప్రతి ఒక్క వాలంటీర్ సమాచారం ఎస్పీ, కలెక్టర్ ఆఫీసుల్లో పెట్టండి. కంప్లైంట్ల కోసం వాట్సాప్ గ్రూప్, టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి. "హిట్లర్ నిఘా వ్యవస్థ లాగా జగన్ వాలంటీర్ వ్యవస్థ మారుతుంది జాగ్రత్త" అని  హెచ్చరిస్తున్నారు.   ఇన్ని వ్యవస్థలు ఉన్నా కూడా సమాంతరంగా ఇంకో వ్యవస్థను నడపడం కేవలం ప్రజలను కంట్రోల్ చేయడానికే వాలంటీర్లు సేకరించే సమాచారంతో రాష్ట్రంలో ఏ మూలన వైసీపీ వ్యతిరేకులు ఉన్నారో జగన్ గమనిస్తున్నాడు. జర్మనీలో హిట్లర్ ఇలానే చేసేవారంటన్నారు.