Pawan Kalyan Contesting From Pithapuram Assenmbly Constituency: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వచ్చే ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఆయన గురువారం అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సుదీర్ఘ ఉత్కంఠకు తెర పడింది. కాగా, 2019 ఎన్నికల్లో పవన్ భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేశారు.


కాగా, ఈ స్థానంలో వైసీపీ అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించలేదు. వంగా గీత, ముద్రగడ పద్మనాభం పేర్లను వైసీపీ అధిష్టానం పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో సీఎం జగన్ నిర్ణయం వెలువరించలేదు. ఇక, ఈ స్థానంపై ఆయన త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. కాగా, టీడీపీ - జనసేన - బీజేపీ పొత్తు నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై అటు అభిమానులు, పార్టీ శ్రేణులు, ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయన ఓ చోట ఎంపీగా పోటీ చేస్తారని, మరో చోట ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఎట్టకేలకు పవన్ పిఠాపురం నుంచే ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని స్ఫష్టం చేయడంతో ఉత్కంఠకు తెరపడింది. 


ఇప్పటివరకూ అభ్యర్థులు వీరే


టీడీపీ, బీజేపీతో పొత్తు నేపథ్యంలో జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆరు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన జనసేనాని.. బుధవారం రాత్రి మరో 9 మందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తొలి జాబితాలో నెల్లిమర్ల- మాధవి, అనకాపల్లి- కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్-  పంతం నానాజీ, తెనాలి- నాదేండ్ల మనోహర్, రాజానగరం - బత్తుల బలరామకృష్ణ, నిడదవోలు కందుల దుర్గేష్ పేర్లను ఖరారు చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకర్ల రమేశ్, ఎలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్, విశాఖ దక్షిణం నుంచి వంశీకృష్ణ యాదవ్ లను సీట్లపై పవన్ స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. వారిని పిలిచి మాట్లాడిన ఆయన.. ప్రచారం చేసుకోవాలని సూచించారు. అలాగే, ఉమ్మడి ప.గో జిల్లా తాడేపల్లిగూడెం అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు నుంచి పత్సమట్ట ధర్మరాజు, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్, భీమవరం నుంచి మంగళవారం పార్టీలో చేరిన పులపర్తి ఆంజనేయుల పేర్లు దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఉమ్మడి తూ.గో జిల్లా రాజోలు నుంచి దేవవరప్రసాద్ అభ్యర్థిత్వానికి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. అటు, తిరుపతి నుంచి అరణి శ్రీనివాసులుతో భేటీ కాగా.. ఈ స్థానం కూడా దాదాపు ఖరారైనట్లేనని పేర్కొంటున్నారు.


ఏబీపీ ఆనాడే చెప్పింది


జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని ఏబీపీ దేశం గతేడాదే అంచనా వేసింది. అక్కడ రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణల దృష్ట్యా ఈ విశ్లేషణ చేసింది. 


Also Read: PM Modi: ఎన్నికల శంఖారావం - తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన, పూర్తి షెడ్యూల్ ఇదే!