Janasena on Jani Master: ఓ యువతిపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ సినీ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ పై జనసేన పార్టీ చర్యలు తీసుకుంది. పవన్ కల్యాణ్ అభిమాని అయిన జానీ మాస్టర్ గత ఎన్నికల ముందు జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పార్టీ జానీ మాస్టర్‌ను స్టార్ క్యాంపెయినర్ గా కూడా నియమించింది. జానీ మాస్టర్ ‌తనపై అత్యాచారం చేశారని తాజాగా ఓ యువతి ఫిర్యాదు చేయడంతో జనసేన పార్టీ ఆయనపై చర్యలు తీసుకుంది. ఆయన ఎలాంటి పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనవద్దని తేల్చి చెప్పింది.


జానీ మాస్టర్ పై బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగికి బదిలీ చేశారు. జానీ మాస్టర్ తనను కొంత కాలంగా వేధిస్తున్నారని, తన మీద అత్యాచారం చేశారని 21 ఏళ్ల వయసు ఉన్న యువతి ఫిర్యాదు చేసింది. ఆమె సహాయ నృత్య దర్శకురాలుగా పని చేస్తున్నట్లుగా చెబుతున్నారు. 


అందుబాటులో లేని యువతి - పోలీసులు
ఈ వ్యవహారంలో నార్సింగి పోలీసులు కూడా మీడియాతో మాట్లాడారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను తాము విచారణ చేస్తామని నార్సింగ్ సీఐ హరి కృష్ణారెడ్డి వెల్లడించారు. సెప్టెంబర్ మధ్యాహ్నం రాయదుర్గం పీఎస్ నుంచి తమకు జీరో ఎఫ్ఐఆర్ వచ్చిందని.. మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని ఓ యువతి ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఆమె ఫిర్యాదుతో జానీ మాస్టర్ పై కేసు నమోదుచేశామని వెల్లడించారు. యువతి నుంచి వాంగ్మూలం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని.. కానీ బాధితురాలు ప్రస్తుతం హైదరాబాద్ లో లేదని సీఐ చెప్పారు. ఆమె అందుబాటులోకి రాగానే ఈ విషయంలో ఆమె నుంచి వాంగ్మూలం తీసుకుంటామని వెల్లడించారు.


టీఎఫ్‌టీడీడీఏ అధ్యక్షుడిగా జానీ
ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) అధ్యక్షుడిగా జానీ మాస్టర్ వ్యవహరిస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఆయన మీద సతీష్ అనే మాస్టర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పలు ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేశారు. అప్పుడు జానీ మాస్టర్ ప్రెస్ మీట్ పెట్టి తనపై చేసిన ఆరోపణలను ఖండించారు. ఆ ఆరోపణలు నిజమని నిరూపిస్తే తాను సినీ పరిశ్రమను వదిలి వెళ్లిపోతానని చెప్పారు. కొందరు లేడీ డాన్సర్లు, కొరియోగ్రాఫర్లకు ఫోన్ చేసి జానీకి వ్యతిరేకంగా మాట్లాడమని సతీష్ చెబుతున్నట్లు ఆయన భార్య అలీషా చెప్పారు.


రాజీనామాకు డిమాండ్


తాజాగా లైంగిక ఆరోపణలతో జానీ మాస్టర్ పొలిటికల్ కెరీర్, ఇండస్ట్రీ కెరియర్ సందిగ్ధంలో పడింది. జనసేన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని జనసేన కోరింది. అంతేకాక, జానీ మాస్టర్ కు వ్యతిరేకంగా డాన్సర్స్ అసోసియేషన్ ఒక్కటవుతుంది. జానీ మాస్టర్ ను రాజీనామా చేయాలని మెజారిటీ సభ్యులు కోరుతున్నారు. లైంగిక వేధింపులపై ఇంటర్నల్ గా డిసిప్లిన్ కమిటీ ఎంక్వయిరీ చేస్తుంది. ఒకవేళ ఆయన రాజీనామా చేయకపోతే సభ్యత్వం రద్దు చేయాలని సభ్యులు కోరుతున్నారు. సభ్యత్వం రద్దు అయితే జానీ మాస్టర్ కెరీర్ కు ప్రమాదం అని సన్నిహితులు చెబుతున్నారు.