Janasena on Allu Arjun: అల్లు అర్జున్ కు తొలిసారి జనసేన నుంచి షాక్ తగిలింది. అల్లు అర్జున్ ఏమైనా పుడింగా అంటూ ఏకంగా ఆ పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. అసలు అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారు ఉన్నది ఒక షామియానా కంపెనీ అంటూ ఎద్దేవా చేశారు. తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే గా గెలిచిన బొలిశెట్టి శ్రీనివాస్ చిరంజీవి కి వీర ఫ్యాన్. కొంతకాలం వరకూ మెగా హీరోల్లో ఒకడుగా ఉన్న అల్లు అర్జున్ కూడా ఆయన ఫేవరెట్ హీరోల్లో  ఉన్నారు  అయితే ఇటీవల అల్లు అర్జున్ చేస్తున్న వ్యాఖ్యలపై అటు మెగా ఫ్యాన్స్ ఇటు జనసైనికులు కాస్త గుర్రుగానే ఉన్నారు.


కానీ ఎవరూ బయటపడింది లేదు. ముఖ్యంగా మొన్నటి ఎన్నికల ప్రచారం లో భాగంగా నంద్యాల లో అడగకుండానే వెళ్లి మరీ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి కి మద్దతు పలికి వచ్చారు అప్పటి నుండీ జనసేన కు అల్లు అర్జున్ కు మధ్య సైలెంట్ వార్ మొదలైంది. మధ్యలో నాగబాబు నర్మగర్భంగా చేసిన ట్వీట్ అప్పట్లో సంచలనం సృష్టించింది. మావాడైనా ప్రత్యర్థుల తో ఉండేవాడు నాకు పరాయివాడే  అంటూ చేసిన పోస్ట్ అల్లు అర్జున్ ను ఉద్దేశించే అని బాగా వైరల్ అయింది.తరువాత ఆయన ఆ పోస్ట్ ను డిలీట్ చేశారు. తరువాత జనసేన నుంచి ఎవరూ అల్లు అర్జున్ పై డైరెక్ట్ కామెంట్స్ చేయలేదు.కానీ మొన్న మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ అల్లు అర్జున్ తన మనసుకు నచ్చితే ఎక్కడికైనా వస్తాను అని చేసిన కామెంట్స్  నంద్యాల ఇన్సిడెంట్ ను ఉద్దేశించి చేసినవే అని జనసేన భావిస్తోంది . దీనిపై ఒక యూట్యూబర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఘాటు కామెంట్స్ చేసారు .


మీ నాన్నను గెలిపించు కోలేక పోయావ్


మనసుకు నచ్చితే ఎక్కడికైనా వస్తాను అన్న అల్లు అర్జున్ కు కౌంటర్ ఇస్తూ "రాకపోతే పో.. నిన్నెవరు పిలిచారు. అసలు అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ ఉన్నారా.. నాకు తెలిసినంత వరకూ మెగా ఫ్యాన్స్ మాత్రమే ఉన్నారు. అల్లు అర్జున్ కు ఉంది షామియానా కంపెనీ మాత్రమే అంటూ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఫ్యాన్స్ వాళ్ళను అల్లు అర్జున్ లో చూసుకోబట్టి నీకు ఫ్యాన్స్ గా ఉన్నారు గానీ మెగా ఫ్యాన్స్ లేకపోతే అల్లు అర్జున్ ఎవరు" అని అన్నారు బోలిశెట్టి. అల్లు అర్జున్ ప్రచారం చేసిన నంద్యాలలో కేండిడేట్ ఓడిపోయాడు. మేము 21 కి 21 సీట్లు గెలిచాం. అసలు 2009లో నరసాపురంలో మీ నాన్న అల్లు అరవింద్ ను గెలిపించుకోలేక పోయావ్ అంటూ సెటైర్స్ వేశారు జన సేన ఎమ్మెల్యే.


ఒక మెగా అభిమానిగా మాత్రమే అలా మాట్లాడా: బొలిశెట్టి శ్రీనివాస్


తన మాటలు ఒక్కసారిగా  వైరల్ కావడంతో ఒక మెగా అభిమానిగా మాత్రమే తాను అలా మాట్లాడానని చిరంజీవిని కానీ మెగా ఫ్యామిలీని గానీ ఎవరైనా ఏదైనా అంటే తాను తట్టుకోలేనని అన్నారు బొలిశెట్టి శ్రీనివాస్. తన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతం అని జనసేన ఎమ్మెల్యే స్పష్టం చేశారు.