Nadendla Manohar : వైసీపీ ప్రభుత్వం ఇళ్లు ఎలాగూ నిర్మించడంలేదు, ఉన్న గుడిసెలు కూడా పీకేస్తున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వ్యక్తిగత కక్షలతో పేదల పూరి గుడిసెలు తొలగిస్తున్నారని మండిపడ్డారు. అనపర్తి, అనకాపల్లి జరిగిన ఘటనలకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. అనపర్తి నియోజకవర్గంలో కామాక్షి అనే మహిళ  త గుడిసెను తొలగించారనే ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. పేదలందరికీ ఇళ్లు అనేది ప్రచారానికే పరిమితం చేసిన వైసీపీ ప్రభుత్వం పేదల గుడిసెలు పీకేయడానికి మాత్రం ఉత్సాహం చూపిస్తోందని విమర్శించారు. వైసీపీ నేతల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, లే అవుట్ల కోసం అడ్డుగా ఉన్నాయని పేదల నివాసాలను ధ్వంసం చేయడం దుర్మార్గం అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బలభద్రపురంలో 40 ఏళ్లుగా గుడిసె వేసుకొని నివసిస్తున్న కోటిపల్లి కామాక్షి కుటుంబాన్ని వైసీపీ నాయకులు వేధింపులకు గురి చేసి ఆమె ఆత్మహత్యకు చేసుకొనేలా చేశారని మండిపడ్డారు.  


వైసీపీ వ్యాపారాల కోసం పేదల గుడిసెలు ధ్వంసం 


కామాక్షి, ఆమె కుమారుడు మురళీకృష్ణ తమ స్థలం కోసం వైసీపీ నాయకులు వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకొంటున్నామని సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడినా పోలీసులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలు కలిగిస్తోందని నాదెండ్ల మనోహర్ అన్నారు. పోలీసు శాఖపై అధికార పార్టీ ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు.  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మురళీకృష్ణకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్లు కట్టించరుగానీ, వైసీపీ వాళ్ల వ్యాపారాల కోసం పేదల గుడిసెలు ధ్వంసం చేయడం, కాదంటే కక్ష సాధించడం ఈ ప్రభుత్వం దౌర్జన్యపూరిత ధోరణిని స్పష్టం చేస్తోందన్నారు. కోటిపల్లి కామాక్షి ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఆ కుటుంబానికి జనసేన పార్టీ సానుభూతి తెలియచేస్తోందన్నారు. వారికి న్యాయం జరిగే వరకూ జనసేన అండగా ఉంటుందన్నారు.






 కొత్త ఎల్లవరం ఘటనకు బాధ్యుడిపై చర్యలు లేవా?


"మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నా వైసీపీ ప్రభుత్వంలో స్పందన లేదు. వేధించేది వైసీపీ నాయకుడైతే కేసులు పెట్టేందుకూ పోలీసులు వెనకాడుతున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజక వర్గం కొత్త ఎల్లవరం గ్రామంలో వైసీపీ నేత ఓ మహిళను వేధించి, ఆమె ఎదురు తిరిగినందుకు ఆమె నివసించే పూరి గుడిసెను అధికారుల ద్వారా ధ్వంసం చేయించాడు. ఆ మహిళ తన ఆరేళ్ల బిడ్డతో కలిసి గుడిలో తలదాచుకోవలసిన దుస్థితి ఏర్పడింది. ఈ దుర్మార్గంపై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? ఈ ఘటనకు బాధ్యుడిపై ఇంత వరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదు? రాష్ట్ర మహిళా కమిషన్ ఏం చేస్తోంది? బాధితురాలికి భరోసా ఇవ్వాలని జనసేన పార్టీ నాయకులకు ఇప్పటికే తెలియచేశాం."- నాదెండ్ల మనోహర్