ఏపీ పాఠశాలల్లో ఐబీ సిలబస్ ప్రవేశపెట్టడంపై సీఎం జగన్ కు అంత తొందర ఎందుకని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. పేద విద్యార్థుల పేరుతో వైసీపీ ప్రభుత్వం విద్యా శాఖలో బహిరంగ అవినీతికి తెర లేపిందని విమర్శించారు. కాకినాడ సమావేశంలో మాట్లాడిన ఆయన, గురువారం ఏపీ విద్యా శాఖ, ఐబీ (ఇంటర్నేషనల్ బెకాలారెట్) సిలబస్ ను పాఠశాలల్లో ప్రవేశ పెట్టేందుకు చేసుకుంటున్న ఒప్పందం సర్కారు అవినీతికి నిదర్శనమని ఆరోపించారు. 


'బలవంతంగా రుద్దుతున్నారు'


'పాఠశాలల్లో మెరుగైన విద్య అందించేందుకు మొన్నటి వరకూ ఆంగ్ల మాధ్యమం అని, ఆ తర్వాత సీబీఎస్ఈ సిలబస్ అని మాయ మాటలు చెప్పిన సీఎం, తాజాగా ఐబీ సిలబస్ ను బలవంతంగా విద్యార్థులపై రుద్దేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ ఐబీ కరికులమ్ ప్రపంచంలో కేవలం 4 వేల పాఠశాలల్లో మాత్రమే అమల్లో ఉంది. దేశం మొత్తం మీద కేవలం 212 పాఠశాలల్లో మాత్రమే ఐబీ సిలబస్ అమలవుతోంది. అలాంటి సిలబస్ ను రాష్ట్రంలో 40 వేలకు పైగా ప్రభుత్వ స్కూల్స్ లో అమలు చేయడం ఏంటి.?' అని నాదెండ్ల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.


ఎందుకంత తొందర.? 


ఐబీ సిలబస్ అన్ని పాఠశాలల్లో అమలు చేయడానికి ఎందుకంత తొందర పడుతున్నారో ప్రజలకు వివరించాలని నాదెండ్ల డిమాండ్ చేశారు. అసలు ఐబీ సిలబస్ వల్ల పేద విద్యార్థులకు ఏం ప్రయోజనమో కూడా చెప్పాలని నిలదీశారు. విద్యా వ్యవస్థను నాశనం చేసేందుకు ప్రభుత్వం ఈ ప్రణాళిక వేస్తున్నట్లుందని మండిపడ్డారు. 


జగన్ సెస్ రూ.4,500 కోట్లు


విద్యా శాఖలో అమలు చేస్తున్న ఈ కొత్త విధానంలో సీఎం జగన్ క్విడ్ ప్రో కో లోగుట్టు ఉందని, ఇందులో జగన్ సెస్ రూ.4,500 కోట్లని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. న్యాయ, ఆర్థిక శాఖలు అభ్యంతరం తెలిపినా జగన్ అత్యుత్సాహం ప్రదర్శనిస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలు సీఎం జగన్ కు పట్టవా అని ప్రశ్నించిన, నాదెండ్ల ఐబీ సిలబస్ అమలును నిలిపేయాలని డిమాండ్ చేశారు.