Pawan Kalyan supports Murthy Yadav : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలపై పోరాడితే చంపేస్తామని బెదిరిస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జీవీఎంసీ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కి అండగా ఉంటామని ప్రకటించారు. విశాఖపట్నం కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలుపై మూర్తి యాదవ్ పోరాడుతున్నారు.. చట్ట ఉల్లంఘనలపై న్యాయ పోరాటం చేస్తున్నారు.. మా పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ని చంపేస్తామని బెదిరించడం అధికార పక్షం వైఖరిని తెలియచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రశ్నించడం, చట్ట ఉల్లంఘనలపై పోరాడటం ప్రజాస్వామ్యంలో భాగం అని గుర్తుచేశారు పవన్ కల్యాణ్.. ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేని పాలకులు, వారి అనుచరులు న్యాయ పోరాటాలను తట్టుకోలేకపోతున్నారని పవన్ విమర్శించారు. మూర్తి యాదవ్ కు ప్రాణ హాని తలపెట్టారని మండిపడ్డారు. విశాఖపట్నంలో రుషికొండను తొలిచేసి ప్యాలెస్ నిర్మించడంపై, దసపల్లా భూముల వ్యవహారం, టీడీఆర్ స్కామ్, టైకూన్ కూడలి మూసివేత, క్రైస్తవ ఆస్తులను కొల్లగొట్టి భారీ భవనాలు నిర్మించడం లాంటి అనేక వైసీపీ నేతల అక్రమాలపై మూర్తి యాదవ్ పోరాడుతున్నారని గుర్తు చేశారు.
జీవీఎంసీలో చోటు చేసుకుంటున్న అవినీతి చర్యలు, తప్పుడు ర్యాటిఫికేషన్లపై కౌన్సిల్ సమావేశాల్లో బలంగా మాట్లాడుతున్నారని తెలిపారు. దీంతో.. అధికార పక్షం జీర్ణించుకోలేక బెదిరింపులకు దిగుతున్నారు.. మూర్తి యాదన్ కు ఏ చిన్నపాటి హాని కలిగినా అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
విశాఖలో జనసేన కార్పొరేటర్ గా ఉన్న పీతల మూర్తి యాదవ్ భూదందాలపై విస్తృతంగా పోరాడుతూంటారు. ముఖ్యంగా వైసీపీ నేతల కబ్జాలపై తీవ్ర ఆరోపణలు చేస్తూంటారు. వాటికి సంబంధించిన ఆధారాలతో కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తూంటారు. అందుకే ఆయనకు వైసీపీ నేతల నుంచి బెదిరింపులు వస్తున్నట్లుగా తెలస్తోంది.