Pawan Kalyan Contesting from Pithapuram- పిఠాపురం: ప్రతి ఒక్కరినీ కలుస్తూ, సమస్యలు తెలుసుకుంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. వేశారు. తన భాగంగా మంగళవారం నియోజక వర్గంలోని యు.కొత్తపల్లి, పిఠాపురం రూరల్ మండలాల్లో పర్యటన చేస్తూ ప్రజలతో మమేకమయ్యారు.మత్స్యకార గ్రామాల్లో మహిళలతో ముచ్చటించారు.. 'మా ఇంటికి రా' అని పిలిచిన వారి గడప తొక్కారు.. ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వీధి వ్యాపారులను ఆప్యాయంగా పలుకరించడంతో పాటు ఆటోలో ప్రయాణించి ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్నారు. నియోజకవర్గం యు.కొత్తపల్లి, పిఠాపురం రూరల్ మండలాల పరిధిలో సుమారు పదికి పైగా గ్రామాల్లో పర్యటించారు. ప్రతి గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కటీ పరిష్కారం అయ్యేలా సమష్టిగా కృషి చేద్దామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని స్థాపించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియచేస్తూ కూటమి అభ్యర్ధిగా పిఠాపురం నుంచి తనను ఆశీర్వదించాలని కోరారు.
చర్చ్ లో పవన్ ప్రత్యేక ప్రార్ధనలు
ఆంధ్రా బాప్టిస్ట్ సెంటినరీ చర్చ్ లో ప్రత్యేక ప్రార్ధనలతో పవన్ కళ్యాణ్ మంగళవారం పర్యటన ప్రారంభించారు. అనంతరం మాదాపురం, ఇసుకపల్లి, నాగులాపల్లి మీదుగా పొన్నాడ వెళ్లారు. ప్రజలు మాదాపురం నుంచి జనసేనానికి సాదర స్వాగతం పలికారు. మత్స్యకార గ్రామాలు, ఎస్సీ కాలనీల్లో ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చి పూల వర్షం కురిపించారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. సమస్యలు తెలుసుకుంటూ పవన్ కళ్యాణ్ యాత్ర సుమారు 20 కిలోమీటర్ల మేర సాగింది. ఇసుకపల్లి గ్రామంలో యాత్ర ప్రారంభించే ముందు దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇల్లు కట్టించండి సర్..
ఇసుకపల్లి, నాగులపల్లి మధ్య రోడ్డు పక్కన కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకునే జుత్తుగ తాతబ్బాయి- పవన్ కళ్యాణ్ కు కొబ్బరి బొండాం కొట్టి ఇచ్చారు. అతన్ని కుర్చీలో కూర్చోబెట్టి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మీరు గెలిచాక నేను వ్యాపారం చేసుకునే ప్రాంతంలోనే ఇల్లు కట్టించి ఇవ్వాలని కోరారు.
పొన్నాడలో చారిత్రక దర్గా దర్శనానంతరం సపోటా తోటల వద్ద కౌలు రైతులతో జనసేనాని పవన్ ముచ్చటించారు. కౌలు వివరాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పొన్నాడ గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు. మత్స్యకార వాడల్లో కలియతిరుగుతూ వారితో మమేకం అయ్యారు. అప్పుడే పెళ్లి చేసుకున్న జంట మణికంఠస్వామి, అన్నపూర్ణలు పవన్ కళ్యాణ్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఆటోలో పవన్ ప్రయాణం..
పవన్ కళ్యాణ్ యు.కొత్తపల్లి, కొండెవరం మధ్య కొంతదూరం ఆటోలో ప్రయాణించారు. ఆటో డ్రైవర్ పక్కన కూర్చుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మీరు అధికారంలోకి రావాలి.. మా సమస్యలు తీరాలని ఆటో డ్రైవర్ కోరారు.
మాదాపురం, ఇసుకపల్లి, నాగులపల్లి, పొన్నాడ, మూలపాడు, ఉప్పాడ, కొత్తపల్లి, కొండెవరం గ్రామాల మీదుగా పవన్ కళ్యాణ్ యాత్ర కొనసాగింది. మహిళలు, రైతులు, కార్మికులు, యువత ఇలా అన్ని వర్గాల వారిని పవన్ టచ్ చేశారు. అందరితో ఫోటోలు దిగి, సెల్ఫీలు ఇస్తూ, కరచాలనాలు చేస్తూ ఉత్సాహపరిచారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను. నాకు ఓటు వేసి గెలిపించాలని స్థానిక ప్రజలను పవన్ కళ్యాణ్ కోరారు.
పవన్ కళ్యాణ్‌తో కీలక నేతల భేటీ
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో పిఠాపురంలో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం బీజెపీ అభ్యర్థి, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆయనతో పాటు కైకలూరు నియోజక వర్గం బీజెపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ సమావేశం అయ్యారు. పిఠాపురం టీడీపీ ఇంఛార్జి వర్మ, పెద్దాపురం ఎమ్మెల్యే, టిడిపి అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప పిఠాపురం వచ్చి పవన్ తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.