YS Jagan About Pension Distribution at Madanapalle Public meeting: మదనపల్లె: నిన్న మొన్నటి వరకూ వైనాట్ 175 అనే నినాదంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం చేశారు. పెత్తందారులకు, సామాన్యులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు అని పదే పదే ప్రస్తావించారు. తాజాగా మదనపల్లెలో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభకు హాజరైన సీఎం జగన్ మాట్లాడుతూ.. వైనాట్ 175 కాదు, ఏపీలు డబుల్ సెంచరీ చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలతో పాటు రాష్ట్రంలోని మొత్తం 25 ఎంపీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ వైనాట్ 200 అంటున్నారు.


పేద ప్రజలకు సంక్షేమ పథకాల్ని దూరం చేయడమే చంద్రబాబు, టీడీపీ, జనసేన లక్ష్యమని జగన్ ఆరోపించారు. అవ్వాతాతలకు, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, మంచం నుంచి లేవలేని స్థితిలో ఉన్న వారికి ఏ ఇబ్బంది లేకుండా ఇంటి వద్ద పింఛన్ పంపిణీ చేస్తుంటే ఈసీకి ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు పరిపాలన అంతా మోసాలేనని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. పింఛన్లు తొలగిస్తారు, సంక్షేమ పథకాలు తీసేస్తారని వ్యాఖ్యానించారు. వైసీపీకి మరోసారి ఓటు వేసి ఆశీర్వదిస్తే.. ఇంటి వద్దే అవ్వాతాతలకు పింఛన్ ఇచ్చేలా కొనసాగిస్తామని చెప్పారు. చంద్రబాబుకు, కూటమికి ఓటు వేస్తే వాలంటీర్ల వ్యవస్థ రద్దుకు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చినట్లేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో పేదలకు, పెత్తందార్లకు మధ్య జరగనున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో ప్రజలు వైసీపీ పక్షాన ఉన్నారని, వారి ఆశీస్సులతో యుద్ధాన్ని గెలిచి చూపించేందుకు మీరంతా సిద్ధమా అని జగన్ అన్నారు.


ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు నెరవేర్చిన వైసీపీ ప్రభుత్వం
2019 ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలలో 99 శాతం అమలు చేశాం. కానీ చంద్రబాబు ఏ మేనిఫెస్టోను పట్టించుకోరు. ఎన్నికల్లో గెలిచేందుకు అమలు చేయలేని ఎన్నో హోమీలను చూపించి ప్రజలను మోసం చేయడంలో దిట్ట. గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని చంద్రబాబు సూపర్ సిక్స్ అంటారు, ఇంటికి కేజీ బంగారం అంటారని.. ఆ మాయమాటలు నమ్మి ఓటు వేస్తే ఏపీ మళ్లీ నాశనం అవుతుంది. మంచి జరిగిందని భావిస్తే నాకు ఓటు వేయండి. అందుకే ఇంటింటికి వెళ్లి తాము చేసిన మంచిని వివరించి, గడప గడపకు తిరిగి ఓట్లు అడుగుతున్నాం. కొన్ని తోడేళ్లు గుంపులుగా మన మీద దాడికి వస్తోంది. ఎన్నికల్లో ఒంటరికిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం వారికి లేదు. వైఎస్ జగన్


జగన్ అనే వ్యక్తిని ఓడించేందుకు 30 పార్టీలు కలిసి వచ్చినా భయపడేది లేదు. ఎన్ని పార్టీలు కలిసొచ్చినా వైసీపీ గెలుపు తథ్యం. 99 మార్కులు తెచ్చుకున్న విద్యార్థి ఏ పరీక్షకు భయపడడు, రాసిన పరీక్షలో 10 మార్కులు వచ్చిన వారికి ఏ పరీక్ష అయినా భయమే. మీ ఇంటికి మేలు జరిగిందని భావిస్తే.. విలువలు, విశ్వసనీయతతో వెళ్తున్న మాకు మరోసారి ఓటు వేసి ఆశీర్వదించండి. సంక్షేమ పథకాలు అందించాం, ప్రజలకు అభివృద్ధి చేశామని చెప్పి ఓట్లు అడిగే నైతిక హక్కు చంద్రబాబుకు లేదంటూ జగన్ మండిపడ్డారు.