Pawan Kalyan Takes Charge As Deputy CM: ఏపీ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని (Vijayawada) క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. తన వదిన, మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ ఇచ్చిన పెన్నుతో బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు, సిబ్బంది శాలువాలు కప్పి సత్కరిస్తూ అభినందనలు తెలిపారు. అనంతరం పలు దస్త్రాలపై ఆయన సంతకం చేశారు. కాగా, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్.. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు పర్యవేక్షిస్తారు. పవన్ ఉన్న ఇదే బ్లాక్‌లో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌కు కూడా బ్లాక్స్ కేటాయించారు.
ఈ కార్యక్రమానికి మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లతో పాటు ఇతర జనసేన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పవన్‌కు మంత్రులు, జనసేన నేతలు అభినందనలు తెలిపారు. ఎంపీ తంగెళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, టీడీపీ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు ఉన్నారు. పదవీ బాధ్యతల అనంతరం పవన్ బిజి బిజీగా గడపనున్నారు. తొలుత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం గ్రూప్ 1, 2 అధికారులతో సమావేశమై చర్చిస్తారు. ఆ తర్వాత పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌తో భేటీ కానున్నారు.
ఇవీ ప్రత్యేకతలు
పవన్ బాధ్యతలు స్వీకరించే సమయంలో తన వదినమ్మ సురేఖ ఇచ్చిన పెన్నుతోనే సంతకాలు చేశారు. ఇదే క్రమంలో శేషేంద్ర శర్మ రాసిన 'ఆధునిక మహాభారతం' అనే పుస్తకాన్ని పక్కన పెట్టుకున్నారు. దీన్ని పవన్ కల్యాణ్ రీపబ్లిష్ చేశారు. కాగా, పవన్ తనకు కేటాయించిన ఛాంబర్‌ను మంగళవారమే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనకు అమరావతి రైతులు దారి పొడవునా ఘన స్వాగతం పలికారు.
'సమస్యలు పరిష్కరిస్తా'
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనకు కేటాయించిన శాఖలపై సంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఆయన జనసేన సిద్ధాంతాలకు ఈ శాఖలు దగ్గరగా ఉన్నాయని అన్నారు. తన పర్యటనల్లో గిరిజనుల తాగునీటి కష్టాలు చూశానని, ఇతర సమస్యలు తెలుసుకున్నానని అన్నింటినీ పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. అటవీ సంపద నాశనం కాకుండా కాపాడతానని, ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు చేపడతానని చెప్పారు. గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యలు, రహదారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని అన్నారు. ఇక పదవీ బాధ్యతలు స్వీకరించిన పవన్ పూర్తిగా తన శాఖలపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. నిరంతరం సమీక్షలు, సమావేశాలతో మెరుగైన ఫలితాలు సాధించేలా ఆయన దృష్టి సారించనున్నారు. మరోవైపు, ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం పట్ల అభిమానులు, జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.