ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై ఇటీవల చిరంజీవి బృందం సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశం సక్సెస్ అయిందని త్వరలో గుడ్ న్యూస్ వింటారని చిరంజీవితో సహా మహేష్ బాబు, ప్రభాష్, రాజమౌళి ప్రకటించారు. అయితే ఈ సమావేశంపై అటు సినిమా ఇండస్ట్రీ, ఇటు సామాన్యుల నుంచి కొన్ని విమర్శలు వచ్చాయి. డైరెక్టర్ ఆర్జీవీ అయితే మరో అడుగు ముందుకు వేసి స్టార్స్ అందరూ బిచ్చమడిగారని సెటైర్స్ వేశారు. దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా మరీ అంత దిగజారిపోవాలా అని ప్రశ్నించారు. టికెట్ల ధరలపై ముందు నుంచీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పవన్ కల్యాణ్ తాజా వ్యవహారాలపై ఇన్ డైరెక్ట్ గా స్పందించారు. వకద శ్రీనివాస రావు చెప్పిన కవితను కోట్ చేస్తూ ట్వీట్ చేశారు. 'ఎరను ఆహారం అనుకుని ఆశపడే స్థితిలో ఉన్న ప్రతి జాతి వేటగాళ్లకు చిక్కుతూనే ఉంటుంది.' అని పవన్ కల్యాణ్ ట్వీ్ట్ చేశారు. అయితే ఈ ట్వీట్ ను ఏపీ ప్రభుత్వం, టాలీవుడ్ ప్రముఖులను ఉద్దేశిస్తూ పెట్టారని పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. టికెట్ ధరల సమస్యను సృష్టించిన ప్రభుత్వమే ఆ సమస్యను పరిష్కరించినట్లు చెప్పుకుంటుందని కామెంట్లు పెడుతున్నారు. టాలీవుడ్ టాప్ హీరోలు తప్పని పరిస్థితుల్లో చప్పట్లు కొడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. 






టికెట్ల ధరల ఇష్యూ  


ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లను ఆన్ లైన్ విధానంలో జారీ చేయాలని నిర్ణయించింది. అందుకు గాను ఓ జీవోను కూడా జారీచేసింది. ఆ తర్వాత సామాన్యులకు అందుబాటులో టికెట్లను తీసుకోస్తున్నామని ప్రకటించి టికెట్ల ధరలను తగ్గించింది. సామాన్యులకు టికెట్ల ధరలు అందుబాటులో ఉండేందుకే ధరలు తగ్గించామని ప్రభుత్వం తమ నిర్ణయాన్ని సపోర్టు చేసుకుంది. ఈ ధరల ఇష్యూపై టాలీవుడ్ లో పెద్ద చర్చే జరిగింది. కొందరు సపోర్ట్ చేస్తే మరికొందరు బహిరంగంగా విమర్శలు చేశారు. టికెట్ రేట్లు తగ్గించడంపై నిర్మాతలు, దర్శకులు మంత్రి పేర్ని నానితో  పలుమార్లు భేటీ అయ్యారు. అయినా సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఇక టాలీవుడ్ పెద్దలు రంగంలోకి దిగి సీఎం జగన్ తో భేటీ వరకూ వెళ్లారు. ఇటీవల చర్చల అనంతరం ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చిందని టాలీవుడ్ టాప్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు చెబుతున్నారు. ప్రభుత్వం టికెట్ ధరలపై వేసిన కమిటీ ధరల పెంపు, ఐదో షోపై సానుకూలంగా రిపోర్టు ఇచ్చిందని, త్వరలో గుడ్ న్యూస్ వింటారని చెబుతున్నారు. 


ముందు నుంచి పవన్ ఫైర్ 


రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆన్ లైన్ టికెట్ల వ్యవహారంపై చేసిన విమర్శలు పెద్ద దుమారాన్నే లేపాయి. అప్పటి నుంచి సమయం దొరికినప్పుడల్లా పవన్ టికెట్ల ఇష్యూపై తనదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. 'ఎవడ్రా మనల్ని ఆపేది కావాలంటే ఫ్రీగా సినిమా వేస్తా' అనే వరకూ పవన్ వచ్చారు. ఏపీ ప్రభుత్వం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసేందుకే టికెట్ ధరల తగ్గింపు, ఆన్ లైన్ టికెట్ వ్యవస్థ తీసుకొచ్చిందని పవన్ ఫ్యాన్స్ విమర్శిస్తుంటారు. అయితే తాజాగా పవన్ పెట్టిన ట్వీట్ లో కూడా ఏపీ ప్రభుత్వాన్నే టార్గెట్ చేశారని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.