Pawan Kalyan New House Rent In Pithapuram: జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వచ్చే ఎన్నికల్లో పిఠాపుర నుంచి పోటీ చేయనున్న విషయం తెలిసిందే. తాను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని.. త్వరలోనే పిఠాపురంలో (Pithapuram) ఇల్లు తీసుకుంటానని జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవల బహిరంగ సభలో ప్రకటించారు. పిఠాపురాన్ని తన స్వస్థలంగా మార్చుకుంటానని ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఆయన తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చేబ్రోలుకు చెందిన అభ్యుదయ రైతు ఓదూరి నాగేశ్వరరావు ఈ మూడంతస్తుల భవంతిని నిర్మించగా.. పార్టీ కార్యకలాపాల నిర్వహణ, వసతికి అనువుగా పవన్ ఈ నివాసాన్ని ఎంచుకున్నారు. ఈ కొత్త భవంతికి చెందిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఉగాది వేడుకలు ఇక్కడే జరుపుకోవాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని సమాచారం. జనసేనాని తన సొంతింటిని నిర్మించుకునే వరకూ ఇక్కడే ఉంటారు. ఈ భవనానికి తుది మెరుగులు దిద్దుతున్నారు.



ఇంటి రెంట్ రూ.1


మూడంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ ను పూర్తిగా వాహనాల పార్కింగ్ కు, ఫస్ట్ ఫ్లోర్ లో ఆఫీస్ నిర్వహణకు, 2, 3 ఫ్లోర్లు కలిపి డూప్లెక్స్ తరహాలో దీన్ని నిర్మించారు. పవన్ కల్యాణ్ పార్టీ కార్యకలాపాలు, ప్రచార కార్యక్రమాలకు ఈ భవనం అనువుగా ఉంటుందని భావించిన జనసేన వర్గాలు దీన్ని ఎంపిక చేశాయి. ఓదూరి నాగేశ్వరరావు పవన్ కు అభిమాని కావడంతో ఇంటి రెంట్ ఏమీ తీసుకోవడం లేదని తెలిపాయి. 'పవన్ కల్యాణ్ అభిమానిగా ఆ భవనానికి ఎలాంటి అద్దె వసూలు చేయను. కేవలం డాక్యుమెంటేషన్ కోసమే నామమాత్రంగా రూ.1 స్వీకరిస్తాను.' అని ఓదూరి నాగేశ్వరరావు పేర్కొన్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. 


నేటి నుంచే ప్రచారం


అయితే, పవన్ కల్యాణ్ ఇటీవల జ్వరం బారిన పడటంతో తాత్కాలికంగా ప్రచారాన్ని నిలిపేశారు. ఆయన కోలుకున్న నేపథ్యంలో మళ్లీ ఆదివారం నుంచి ఎన్నికల క్యాంపెయిన్ ప్రారంభించనున్నారు. ఆదివారం నుంచి పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి యాత్ర ఉత్తరాంధ్రలో నిర్వహించనున్నారు. స్వల్ప అస్వస్థత కారణంగా పవన్ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడింది. యాత్రలో భాగంగా అనకాపల్లిలో 7న సభ నిర్వహించనున్నారు. 8న ఎలమంచిలి, 9న పిఠాపురంలో సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నెల్లిమర్ల, అనకాపల్లి, యలమంచిలి నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పిఠాపురం తర్వాత ఆయన తెనాలిలో ప్రచారం చేయాల్సి ఉంది. ఉత్తరాంధ్ర  పర్యటన తర్వాత తెనాలి సభలో ప్రసంగించే అవకాశం ఉంది. 


అటు, టీడీపీ - బీజేపీ - జనసేన పార్లమెంటు స్థాయి ఉమ్మడి సమన్వయ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ స్థాయిలో ఉమ్మడి సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి కూటమి కార్యాచరణను రూపొందించుకోనున్నారు. ఎన్నికలు సన్నద్ధత, ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్, కొత్త ఓటర్లు, ఇతర ప్రాంతాల్లో నివసించే ఓటర్లు, పోస్టల్ ఓట్లు, బూత్ ఏజెంట్ లు తదితర అంశాలపై చర్చించనున్నారు. కూటమి తరఫున భారీ బహిరంగ సభలు నిర్వహణ, సామాజిక మాధ్యమాల్లో ఎంపీ, ఎమ్యెల్యే అభ్యర్థులు ప్రచారంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఎంపీ అభ్యర్థి మేనిఫెస్టో ఇతర స్థానిక సమస్యలపైనా చర్చించనున్నారు. కూటమి పార్లమెంట్​ స్థాయి అభ్యర్థులు, పార్టీ అధ్యక్షులు పాల్గొనున్నాంట్లు సమాచారం. అంతే కాకుండా 7 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు, 7 నియోజకవర్గ ఇన్​ఛార్జీలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.


Also Read: Kuppam News: కుప్పంలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా, 384 మంది ఒకేసారి