Pawan In Party Office : జనసేన అధినేత పవన్ కల్యాణ్ .. రెండు రోజుల నుంచి మంగళగిరి పార్టీ ఆఫీసులో ఉన్నారు. జనసేన పార్టీ ఆఫీసులో నూతన భవనం ప్రారంభోత్సవం చేశారు. గురువారం నుంచి పార్టీ కార్యాలయంలోనే ఉన్న ఆయన పార్టీ కీలక నేతలతో పెద్దగా మాట్లాడటం లేదు. కానీ కొన్ని సర్వే సంస్థల ప్రతినిధులతో సమావేశం అయినట్లుగ జనసేన వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఖాయమని పవన్ ఇప్పటికే ప్రకటించారు. అధికారికంగా రెండు పార్టీలు ఇంకా పొత్తలపై కలసికట్టుగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం.. కలసి పోటీ చేసి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నారు.
జనసేన పోటీ చేసే స్థానాలపై చర్చలు
బలం ఉన్న చోట్లనే పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. జనసేనకు ఏ ఏ స్థానాల్లో బలం ఉందో తేల్చుకునేందుకు ఆయన కొన్ని సర్వే సంస్థలకు బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా పోటీ చేసే అన్ని స్థానాల్లో గెలిచేందుకు పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. జనసేనకు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు.. స్థానిక ఎన్నికల్లో వచ్చిన ఓట్లు.. తాజాగా సర్వేల్లో వస్తున్న ఫలితాలను బట్టి.. తెలుగుదేశం పార్టీ దగ్గర సీట్ల కోసం ప్రతిపాదనలు పెట్టనున్నట్లుగా చెబుతున్నారు. సర్వే సంస్థలు ఏం చెప్పాయన్నదానిపైనా స్పష్టత లేదు. సర్వేలు నిజాయితీగా ఉండాలని.. బలాన్ని బట్టే జనసేన పార్టీ పోటీ చేస్తుందని జనసేన వర్గాలకు పవన్ స్పష్టం చేస్తున్నారు.
పవన్ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ
పవన్ కల్యాణ్ ఈ సారి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారన్నదానిపైనా స్పష్టత లేదు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేశారు. రెండు స్థానాల్లో పోటీ చేయడం వల్ల అక్కడ గెలుస్తారులే అని భీమవరం వాసులు.. భీమవరంలో గెలుస్తారులో అని గాజువాక వాసులు అనుకుని ఓటింగ్ తగ్గించడంతో ఆయన రెండు చోట్ల రెండో స్థానానికే పరిమితం అయ్యారు. తెలుగుదేశం పార్టీ తపున కూడా ఆ రెండు చోట్ల అభ్యర్థులు భారీగా ఓట్లు సాధించారు. ఈ క్రమంలో రెండూ పొత్తులతో పోటీ చేస్తే.. ఎక్కడ పోటీ చేసినా పవన్ కు భారీ మెజార్టీ వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే అదే చోట నుంచి పోటీ చేస్తారా లేకపోతే.. మారుతారా అ్నది తేలాల్సి ఉంది.
పొత్తులు పోటీ చేసే సీట్ల గురించి తనకు వదిలేయాలన్న పవన్
పొత్తులు, పోటీ చేసే సీట్ల విషయంలో పార్టీ నేతలతో చర్చించేందుకు పవన్ కల్యాణ్ ఇష్టపడటం లేదని చెబుతున్నారు. ఆ విషయాలను తనకు వదిలేయాలని చెబుతున్నారు. తన నిర్ణయాన్ని శిరసావహించేవారే పార్టీ నేతలని.. వ్యతిరేకించేవారిని పట్టించుకోనని ఆయన చెబుతున్నారు. జనసేన పార్టీని వచ్చే ఎన్నికల్లో బలమైన పార్టీగా.. అసెంబ్లీలో కీలక స్థానంలో ఉండేలా చూసుకోవాలని పవన్ కల్యాణ్ పట్టుదలగా ఉన్నారు.