Rapaka MLA :   రాజోలు ఎమ్మెల్యే రాపాక ప్రసాద్ కుమారుడి పెళ్లి త్వరలో జరగనుంది. రాపాక త‌న‌ కుమారుడి వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ముద్రించిన శుభలేఖపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆయన భార్య భారతి రెడ్డి చిత్రాలను ముద్రించారు. వారి ఆశీస్సులతో తన కుమారుడి పెళ్లి జరుగుతోందని అందులో పేర్కొన్నారు. శుభలేఖ పైభాగంలో జగన్ భారతి చిత్రాలు ఆకట్టుకునేలా ముద్రించారు. వారిని దైవ సమానులుగా పేర్కొన్నారు.                     


ఈ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎందుకంటే.. రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీలో టిక్కెట్ ఇవ్వలేదని చివరి రోజుల్లో ఆయన జనసేనలో చేరితే వెంటనే బీఫాం ఇచ్చారు పవన్ కల్యాణ్. జనసేన కోసం కొంత మంది పార్టీ నేతలు కష్టపడినప్పటికీ రాపాక మాజీ ఎమ్మెల్యే కావడంతో టిక్కెట్ ఇచ్చారు. అదృష్టం బాగుండి.. త్రిముఖ పోరులో రాపాక చాలా స్వల్ప తేడాతో విజయం సాధించారు. కొద్ది రోజులకే ఆయన పవన్ కల్యాణ్ ను విమర్శించి పార్టీకి దూరయ్యారు.                                  


ఇప్పటికే పలుమార్లు బయట అసెంబీలో జగన్ ను ఆకాశానికి ఎత్తేస్తూ రాపాక మాట్లాడి తన వీర విధేయతను నిరూపించుకున్నారు. ఇప్పుడు ఏకంగా తన కుమారుడి పెళ్లి ఆహ్వానపత్రికపై సీఎం దంపతుల ఫొటోలు ముద్రించి తాను జగన్ కు వీరభక్తుడినని మ‌రోసారి చాటిచెప్పారు. ఈ పెళ్లి పత్రికపై వైసీపీ శ్రేణులు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెళ్లి పత్రికను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. జ‌నసేన పార్టీ త‌రుపున గెలిచి వైసీపీ గూటికి చేరిన కోనసీమ జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు జ‌గ‌న్ ఆయ‌న‌కు సీటు ఖరారు చేశారు. దీంతో రాపాక ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప‌ట్ల ఉన్న‌కృత‌జ్ఞ‌త‌ల‌ను వినూత్నంగా తెలిపారని అంటున్నారు.                            


వైసీపీ కోసం ఐదేళ్లు పని చేసినా జగన్ మోసం చేస్తే.. పవన్ టిక్కెట్ ఇచ్చారని ఇప్పుడు ఆయననే మోసం చేశారని జనసైనికులు విమర్శిస్తున్నారు. అయితే వైసీపీ సానుభూతిపరులు మాత్రం పవన్ గెలవలేదు.. పవన్ వల్ల రాపాక ఎలా గెలుస్తారని ప్రశ్నిస్తున్నారు. నిజానికి రాపాక గతంలో 2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే..సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ మూడు వందల ఓట్లు కూడా రాలేదు. ఈ జాబితాను కొంత మంది సోషల్ మీడియాలో పెట్టి సొంతంగా మూడు వందల ఓట్లు కూడా తెచ్చుకోలేని రాపాక ఎమ్మెల్యేగా ఎలా నెగ్గుతారని ప్రశ్నిస్తున్నారు.