Jagananne Maa Bhavishyathu: జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు పార్టీ కేంద్ర కార్యాలయం సమాచారం పంపించింది. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న అపూర్వ స్పందన, ప్రజలు భాగస్వామ్యం అవుతున్న తీరుతో సంతోషిస్తున్న వైసీపీ పార్టీ.. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమ షెడ్యూల్ ను మరో 9 రోజుల పాటు పొడిగించింది. జగనన్నే మా భవిష్యత్ రాష్ట్రవ్యాప్తంగా హుషారుగా సాగుతోంది. ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు, కన్వీనర్లు, గృహసారథులు కలిసి జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని జోరుగా చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి జగన్ పాలనలో జరిగిన అభివృద్ధిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు, వారు పొందుతున్న లబ్ధిని అడిగి తెలుసుకుంటున్నారు. గత టీడీపీ పాలనకు, వైసీపీ పాలనకు మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ స్టిక్కర్ అతికించి, వైఎస్ జగన్ కు మద్దతుగా 82960 82960 నంబర్ కు మిస్డ్ కాల్ ఇప్పించి ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపిస్తున్నారు. అనంతరం వారితో సెల్ఫీలు దిగుతున్నారు. ఇలా రోజూ లక్షలాది మంది నుండి 82960 82960 నంబర్ కు మిస్డ్ కాల్స్ వస్తున్నాయి. 


జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి అపూర్వ స్పందన


జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి రాష్ట్ర ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించలేదని అంటున్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి వెళ్తున్నామని, ప్రతి కుటుంబం స్పందనను సేకరిస్తున్నామని, ప్రతి ఒక్కరికీ వైసీపీ పాలన తీరుతెన్నులు వివరిస్తున్నామని వైసీపీ నాయకులు చెబుతున్నారు. 12 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 84 లక్షల కుటుంబాలను కలిసి జగన్ ప్రభుత్వ పథకాల గురించి వివరించినట్లు వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. జగన్ పాలనపై ప్రతి ఒక్కరి స్పందన రికార్డు చేస్తున్నామని నాయకులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రజలు తమ సొంత, తమ పిల్లల భవిష్యత్తు కోసం జగన్ ను మరోసారి సీఎం ను చేయాలన్న కోరికతో ఉన్నారని, దానికి 63 లక్షలకు పైగా మిస్ట్ కాల్సే నిదర్శనమని అంటున్నారు. ఈ కార్యక్రమం మరి కొన్ని రోజులు పెంచితే మరిన్ని కుటుంబాలకు చేరువ అవుతామని ధీమాగా చెబుతున్నారు. 


రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఓటరుకి ప్రభుత్వం నుండి అందాల్సిన సేవలు అన్నింటినీ అందిస్తున్నామని వైసీపీ నాయకులు చెబుతున్నారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారని కొనియాడుతున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో మాట్లాడిన మంత్రి ధర్మాన ప్రసాదరావు.. తమ పాలనలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. నాడు-నేడు పేరిట స్కూల్స్ గొప్పగా అభివృద్ధి చెందాయని మంత్రి అన్నారు. విద్యార్థులకు ఆధునిక సంకేతికత అందుబాటులో ఉంచి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని వెల్లడించారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పోషకాహారం అందిస్తున్నట్లు తెలిపారు.