AP New Scheme : "జగనన్నకు చెప్పుకుందాం" అనే కొత్త స్కీమ్‌ను 13వ తేదీ నుంచి ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇది కొత్త పథకం. అయితే ఇది సీఎం జగన్ చెప్పే డీబీటీ స్కీం కాదు., ప్రజల సమస్యలను అదే పద్దతిలో నీట నొక్కి పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ అనుకోవచ్చు. సీఎం జగన్‌కు తమ సమస్యలు చెప్పుకోవాలనుకునేవాళ్లు లక్షల మంది ఉంటారు. కారణాలు ఏమైనా సీఎం జగన్ ప్రజాదర్బార్ లాంటివి పెట్టలేకపోయారు. ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలను విపక్షాల నుంచి ఎదుర్కొంటున్నారు. స్పందన కార్యక్రమం ప్రభావవంతంగా లేదన్న విమర్శలూ ఉన్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు "జగనన్నకు చెప్పుకుందాం" కార్యక్రమాన్ని డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది.
నేరుగా జగన్ వాయిస్‌తోనే సమస్యలు వినేలా ప్రోగ్రామింగ్ !
"జగనన్నకు చెప్పుకుందాం" కార్యక్రమం కోసం ముందుగా ఓ నెంబర్ ప్రకటిస్తారు. ఆ నెంబర్‌కు ఫోన్ చేసి సీఎం జగన్‌కు సమస్య చెప్పుకోవచ్చు. ఈ వ్యవస్థ ఎలా పని చేస్తుందంటే... మనం ఫ్లిప్ కార్ట్ లేదా అమెజాన్‌లోనే లేకపోతే ఇంకో ఆన్ లైన్ వ్యవస్థలో సేవలు పొందినప్పుడో.. మనకు సమస్య వస్తే..... వెంటనే వారి కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తాం. వారు ఐవీఆర్ఎస్ పద్దతిలో సమస్యను వర్గీకరించి .. నమోదు చేసుకుని ఓ టిక్కెట్ నెంబర్ కేటాయిస్తారు. ఆ టిక్కెట్ ను ఫలానా సమయంలోపు పరిష్కరిస్తారు. అచ్చంగా ఇదే పద్దతిని ప్రభుత్వంలోకి తీసుకు వస్తున్నారు సీఎం జగన్. సమస్య చెప్పుకునేందుకు ఎవరైనా కాల్ చేయగానే. ఫస్ట్ జగన్ వాయిస్ వస్తుంది. మీ సమస్య ఏంటో చెప్పమని జగన్ చెప్పే ఇంటారాక్టివ్ వాయిస్ ఉంటుంది. వాళ్లు ఐవీఆర్ఎస్ లో విభాగాల వారీగా సమస్యను వర్గీకరించుకున్న తర్వాత మళ్లీ జగన్ వాయిస్ లో దీన్ని మా విభాగం వాళ్లకి పంపుతున్నాను అనే వాయిస్ వస్తుంది. ఆ తర్వాత టిక్కెట్ రైజ్ అవుతుంది. ఇందు కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తున్నందున ఫిర్యాదు చేసే వారికి నమ్మకం కల్పించేందుకు వారితో ఫోన్‌లో మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరిని నేరుగా సీఎంవో మానిటర్ చేస్తుందని చెబుతున్నారు.
సమస్యను పరిష్కరిస్తామనే భరోసా ఇవ్వడమే లక్ష్యం !
ప్రభుత్వం తరపు నుంచి సమస్యల పరిష్కారం కోసం ఎంతో మంది సీఎం జగన్ కు వినతి పత్రాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారందరికీ ఈ వ్యవస్థ మేలు చేస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని భావిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చే స్పందనకు తగ్గట్లుగా అధికారులు వేగంగా సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం కొత్త ఇబ్బందులు వస్తాయన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే స్పందనలో లక్షల సంఖ్యలో ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నాయి. చాలా వరకూ పరిష్కరించకపోయినా పరిష్కరించినట్లుగా మెసెజులు వచ్చాయి. ఇలా .. జగనన్నకు చెప్పుకుందాం కార్యక్రమంలోనూ జరిగితే ప్రజలు నమ్మకం కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇలాంటివి జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
బెంగాల్‌లో దీదీకో బోలో - ఇక్కడ జగనన్నకు చెప్పుకుందాం !
అయితే ఇది కొత్త స్కీమ్ ఏమీ కాదు. ఇప్పటికే బెంగాల్‌లో అమల్లో ఉంది. అక్కడ దీదీకి బోలో ( https://www.didikebolo.com/ ) పేరుతో ప్రత్యేకంగా వెబ్ సైట్ కూడా నిర్వహిస్తున్నారు. కాల్ సెంటర్ కూడా ఉంది. అక్కడి ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడానికి ముందు ఈ కార్యక్రమాన్ని తెచ్చింది. ఓ నెంబర్ కు విస్తృతంగా ప్రచారం చేసింది. వాటికి ప్రజలు తమ సమస్యలు చెప్పుకున్నారు. అక్కడ తర్వాత ఎన్నికల్లో మమతా బెనర్జీ విజయం సాధించారు. దీంతో ఇది బాగుందని ఏపీలో అమలు చేయాలనుకుంటున్నారు. జగన్ పుట్టిన రోజు నాటికే సిద్ధం చేయాలనుకున్నారు. కానీ ఆలస్యం అయింది. దీని ద్వారా పబ్లిక్ తో నేరుగా కనెక్ట్ అవ్వొచ్చని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రే నేరుగా మాట్లాడుతూ భరోసా కల్పించిన భావన ప్రజలకు కలుగుతుందని భావిస్తున్నారు.
మొత్తం ఐ ప్యాక్ పర్యవేక్షణే !
మొత్తంగా ఐ ప్యాక్ పర్యవేక్షణలోనే ఈ స్కీమ్ అమలవుతుందని చెబుతున్నారు. బెంగాల్‌లో దీదీకో బోలోను ప్రశాంత్ కిషోర్ డిజైన్ చేశారు. ఇప్పుడు దాన్నే ఏపీకి తీసుకు వస్తున్నారు. అక్కడ ఐ ప్యాక్ పర్యవేక్షణ చేసినట్లుగానే ఏపీలోనూ అదే పద్దతి అమలు చేస్తారని భావిస్తున్నారు.