Jagananna Gorumudda Scheme: ప్రభుత్వ పాఠశాల‌్లో చదువుతున్న పిల్లలకు రాగిజావ అందించే కార్యక్రమాన్ని తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ... తాము అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచి కూడా విద్యార్థుల కోసం చాలా అడుగులు వేశామని చెప్పారు. బడి మానేసే పిల్లల సంఖ్యను తగ్గించడం ఎలా, స్కూళ్లలో సదుపాయాలను కల్పించడం ఎలా, మేథో వికాసాన్ని పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని అలోచించి మరీ అనేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
పిల్లల్లో ఐరన్, కాల్షియం పెరగడానికే ఈ రాగిజావ
గర్భవతులైన మహిళల దగ్గర నుంచి చిన్నారులు వరకు సంపూర్ణ పోషణ ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. తర్వాత ఇంగ్లిషు మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్, బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్, ఐఎఫ్‌ఎపీ ప్యానెల్స్ ఆరో తరగతి నుంచి ఏర్పాటు, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇవ్వడం… ఇలా ప్రతి అడుగులోనూ పిల్లలను చేయిపట్టి నడిపిస్తున్నామన్నారు. అమ్మ ఒడి, విద్యాకానుక అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. పై చదువుల్లో కూడా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఆయన వివరించారు. విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్న ఆయన... మన పిల్లలు అందర్నీకూడా భావి ప్రపంచంతో పోటీ పడి వారు నెగ్గేలా ఈ కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. గోరుముద్ద కార్యక్రమాన్ని మరింతగా పటిష్టంగా అమలు చేసేలా అడుగులు వేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఈరోజు నుంచి రాగిజావ కూడా పిల్లలకు అందిస్తామన్నారు. గోరుముద్దను మరింత మెరుగ్గా చేయడానికే ఈ ప్రయ్నతాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. పిల్లలకు ఐరన్ కాని, కాల్షియం కాని పెరగడానికి ఈ ఆహారం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. 1 నుంచి 10 తరగతి పిల్లలకు దాదాపు 38 లక్షల మంది పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు.
రోజుకో మెనూతో పిల్లలకు భోజనం..
తమ ప్రభుత్వం రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో.. ఒకసారి తేడాను గమనించాలని కోరారు. మొత్తం సంవత్సరం అంతా కలిపినా కూడా గతంలో ఏడాదికి కేవలం రూ.450 కోట్లు కూడా ఖర్చు చేయలేని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు ఆయాలకు 8-10 నెలలు బకాయిలు పెట్టే పరిస్థితి ఉండేదని.. సరుకులు కూడా 6-8 నెలలుగా బకాయిలు పెట్టే వాళ్లను చెప్పారు. ఇలా బకాయిల పెడితే… క్వాలిటీ అనేది ఉండదని సీఎం జగన్ తెలిపారు. గోరు ముద్ద ద్వారా ప్రతిష్ట్మాతకంగా మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. అలాగే ఇప్పుడు ఏడాదికి రూ.1824 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని.. రోజుకో మెనూతో పిల్లలకు భోజనం పెడుతున్నామని వివరించారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పిల్లలు ఏం తింటున్నారు అనే ఆలోచన చేసిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదున్నారు. పిల్లలకు మంచి మేనమామలా… ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మనం చేయకపోతే.. ఇంకెవరు చేస్తారన్న ఉద్దేశంతోనే గోరుముద్ద పథకాన్ని చేపట్టినట్లు వివరించారు. మొత్తం 15 రకాల ఆహార పదార్థాలు పిల్లలకు గోరుముద్ద ద్వారా అందిస్తున్నట్లు వెల్లడించారు.
అలాగే వారంలో 5 రోజుల పాటు ఉడికించిన గుడ్లు ఇస్తున్నామని.. మూడు రోజులు చిక్కి ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. మిగిలిన మూడు రోజులు మంగళ, గురువారం, శనివారాల్లో రాగి జావ ఇప్పుడు ఇస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో సత్యాసాయి ట్రస్టు భాగస్వాములు కావడం సంతోషకరంగా ఉందన్నారు. శ్రీ సత్యసాయి స్వామి వారి ఆశీస్సులు కూడా ఈ కార్యక్రమానికి ఉంటాయని భావిస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. పరీక్షలు రాయబోతున్న పిల్లలందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పారు. ఏడాదికి రూ.84 కోట్లు రాగిజావ కోసం ఖర్చు చేస్తుండగా... మొత్తం గోరుముద్దకోసం చేస్తున్న ఖర్చు రూ.1910 కోట్లకుపైగా ఖర్చు అవుతుందన్నారు.