తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పరీక్షా పేపర్ల లీక్ వ్యవహారంలో నిందితులు రేణుక, ఆమె భర్త డాక్యా నాయక్ లపై వేటు పడింది. రేణుక వనపర్తి జిల్లా గోపాల్ పేట్ మండలం బుద్ధారం బాలికల గురుకుల పాఠశాలలో హిందీ టీచర్ గా పనిచేస్తుంది. ఆ స్కూల్ ప్రిన్సిపల్ రేణుక గురించి ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రెటరీ రోనాల్డ్ రోస్ కి నివేదిక పంపగా, దీని ఆధారంగా రేణుకని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మరోవైపు, వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ఎంపీడీఓ ఆఫీస్ లో ఉపాధి హామీలో టెక్నికల్ అసిస్టెంట్ గా రేణుక భర్త డాక్యా నాయక్ పని చేస్తున్నారు. పేపర్ల లీక్ వ్యవహారం నేపథ్యంలో వీరిద్దరిని విధుల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లుగా సంబంధిత ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.


నేడు హైకోర్టులో విచారణ


రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం దర్యాప్తుపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. సీబీఐతో లేదా సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ చేయించాలని, అభ్యర్థులతో పాటు ఎన్ఎస్‌యుఐ (NSUI) పిటిషన్ దాఖలు చేసింది. పిటిషనర్ల తరుపున వాదించడానికి నేషనల్ ఎన్‌ఎస్‌యూఐ లీగల్ ఇంఛార్జి వికాస్ దన్కే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రానున్నారు. సిట్ దర్యాప్తును ప్రభుత్వం ప్రభావితం చేసేలా ఉందని పిటిషనర్లు చెబుతున్నారు. ఈ లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి హస్తం ఉందని పిటిషనర్లు ఆరోపించారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడు రాజశేఖర్ భార్య సుచరిత మరో పిటిషన్ దాఖలు చేశారు. తన భర్తపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని సుచరిత కోరారు. పేపర్ లీకేజ్ వ్యవహారంపై జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం నేడు విచారణ చేయనుంది.