Jagan On economic situation in AP: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న గణాంకాలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు.   రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఎస్‌డీపీ వృద్ధి రేటు గణాంకాలు ప్రజలను మభ్యపెట్టేలా ఉన్నాయని, ఆదాయం పెరగకుండానే వృద్ధి రేటు ఎలా పెరుగుతుందని  ఆయన ప్రశ్నించారు. 

Continues below advertisement

వృద్ధి రేటు అంకెల్లో మాయాజాలం 

2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నామమాత్రపు జీఎస్‌డీపీ పరంగా 11.75 శాతం వృద్ధి సాధించిందని ప్రభుత్వం పేర్కొంది. ఇది జాతీయ వృద్ధి రేటు 9.8 శాతం కంటే అధికమని ప్రభుత్వం చెబుతోంది. అలాగే 2025-26లో కూడా రాష్ట్రం 10.75 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. రియల్ జీఎస్‌డీపీ వృద్ధిలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏపీ మూడవ స్థానంలో నిలిచిందన్న ప్రభుత్వ వాదనను విపక్షం తప్పుబట్టింది. ఈ గణాంకాలు స్వయంగా ప్రభుత్వం తయారు చేసుకున్నవే తప్ప ఏ స్వతంత్ర సంస్థ ధృవీకరించినవి కావని జగన్ స్పష్టం చేశారు. 

Continues below advertisement

కాగ్ నివేదిక - ఆదాయ వృద్ధిలో వెనుకంజ 

ప్రభుత్వం చెబుతున్న వృద్ధి రేటు నిజమే అయితే, ఆ మేరకు ప్రభుత్వ పన్నుల ఆదాయం ఎందుకు పెరగలేదని జగన్ ప్రశ్నించారు.  కాగ్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గడిచిన రెండు ఏళ్ల కాలంలో ప్రభుత్వ పన్ను రాబడి కేవలం 1.97 శాతం మాత్రమే వృద్ధి చెందింది. 11.09 శాతం జీఎస్‌డీపీ వృద్ధిని చూపిస్తున్న రాష్ట్రంలో, పన్ను ఆదాయం కేవలం 1.97 శాతం మాత్రమే పెరగడం ఆర్థికవేత్తలకే అంతుచిక్కని విషయమని, ఇదంతా కృత్రిమంగా సృష్టించిన గణాంకాల వల్లే సాధ్యమైందని జగన్ ఆరోపించారు. 

దేశంలోనే 22వ ర్యాంకు 

దేశంలోని 23 రాష్ట్రాలకు సంబంధించి కాగ్ అప్‌లోడ్ చేసిన తాజా ఖాతాలను విశ్లేషిస్తే, పన్ను ఆదాయ వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో నిలిచింది. అంటే కింద నుంచి రెండవ స్థానంలో రాష్ట్రం ఉందని జగన్ అన్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయం 9.64 శాతం వృద్ధి చెందగా, ఏపీ ఆదాయం మాత్రం వెనుకబడి ఉందని పేర్కొంది. ఆర్థిక రంగంలో కేంద్రం కంటే మెరుగ్గా ఉన్నామని ప్రభుత్వం చెప్పుకోవడంలో అర్థం లేదని విమర్శించారు.  

రుణాలు అవినీతిలో అగ్రస్థానం 

రాష్ట్రంలో ఆర్థిక మందగమనం స్పష్టంగా కనిపిస్తున్నా, ప్రభుత్వం మాత్రం పసలేని ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విపక్షం మండిపడింది. అభివృద్ధి ఆగిపోయినా, ప్రభుత్వ అప్పులు, అవినీతి ,  రాజకీయ కక్షసాధింపు చర్యల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని జగన్ విమర్శించారు. వాస్తవాలను కప్పిపుచ్చి తప్పుడు ప్రచారంతో విజనరీగా చెప్పుకోవడం కేవలం ప్రచార ఆర్భాటం మాత్రమేనన్నారు.