Jagan private security beat YCP workers: పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున వైసీపీ అధినేత జగన్ అనంతపురం పర్యటనకు వెళ్లారు. అయితే అది రాజకీయ పర్యటన కాదు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఇంచార్జ్ విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడి పెళ్లికి వెళ్లారు. ఇటీవల పార్టీ నేతల ఇళ్లలో శుభకార్యాలకు జగన్ వెళ్తున్నారు. ఇటీవల బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడి పెళ్లికి కర్నూలు వెళ్లారు.
జగన్ వ్యక్తిగత పర్యటనకు వెళ్తున్నప్పటికీ.. కొంత మంది పార్టీ నేతలు జన సమీకరణ చేస్తున్నారు. రప్పా రప్పా ప్లకార్డులు పెట్టుకుని ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. జై జగన్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఇలా అనంతపురంలోనూ ఆయన కోసం అభిమానుల్ని.. కొంత మంది పార్టీ నేతలు పెళ్లి మండలానికి తీసుకు వచ్చారు. బయట నినాదాలిచ్చి.. స్వాగతం పలికి ఉంటే సరిపోయేది కానీ.. అలా వచ్చిన వారు మండపంలోకి వచ్చేశారు.
జగన్మోహన్ రెడ్డి కోసం ప్రభుత్వం సెక్యూరిటీ ఏర్పాటు చేసినా.. ఇటీవల సొంతంగా యాభై మంది మాజీ ఆర్మీ సిబ్బందితో ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. వారు జగన్ వద్దకు ఎవరూ రాకుండా రోప్ పార్టీగా ఉంటున్నారు. ఈ పెళ్లినూ ఆ సిబ్బంది రోప్ పార్టీగా నిలబడ్డారు.కానీ కొంత మంది కార్యకర్తలు జగన్ తో కరచాలనం చేసేందుకు రోప్ పార్టీని దాటి ముందుకు వచ్చారు. అంతే... ఈ ప్రైవేటు సెక్యూరిటీ ఒక్క సారిగా విరుచుకుపడింది. కార్యకర్తల్ని చితక్కొట్టింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తన ప్రైవేటు సెక్యూరిటీ .. కార్యకర్తల్ని, అభిమానుల్ని కొడుతున్నా జగన్ పట్టించుకోలేదని.. కనీసం ఆపమని చెప్పలేదన్న విమర్శలు వస్తున్నాయి. సొంత పార్టీ కార్యకర్తలను జగన్ కొట్టిస్తున్నారని టీడీపీ నేతలు సోషల్ మీడియాలో విమర్శలు ప్రారంభించారు.
రాజకీయ పార్టీల నేతలు వచ్చినప్పుడు.. చాలాచోట్ల దూరంగా నిలబడి అభివాదాలు చేస్తూంటారు. కానీ జగన్ పర్యటనలో మాత్రం.. కొంత మంది మీద పడిపోవాలని అనుకుంటూ ఉంటారు. వారితో జగన్ భద్రతకు సమస్యలు వస్తున్నాయంటున్నారు.