Jagan demands repolling :  కేంద్ర బలగాల ఆధ్వర్యంలో, వారి భద్రత నడుమ జడ్పీటీసీ ఎన్నికలను తిరిగి ఎన్నిక నిర్వహించాలని వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన సోషల్ మీడియాలో స్పందించారు.  పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న ZPTC సీటును లాక్కునేందుకు, రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్టZPTC సీటును బలవంతంగా చెరబట్టేందుకు  చంద్రబాబు అరాచకాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు.  ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగంచేస్తూ, అధికారులను చెప్పుచేతల్లోకి తీసుకుని, పోలీసులను వాడుకుని, ఈ ఎన్నికను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్‌ చేశారని మండిపడ్డారు. 

పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికలను రద్దు చేయాలని, కేంద్ర బలగాల ఆధీనంలో తిరిగి ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.   రాష్ట్రంలో రాజ్యాంగం, చట్టం, న్యాయం, ధర్మం, నిబంధనలు, ప్రజాస్వామ్య పద్ధతులు అన్నవి ఒట్టిమాటలేనని, వ్యవస్థలనేవి కేవలం అలంకార ప్రాయం మాత్రమేనని మరోమారు రుజువైందన్నారు. ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓట్లేసేలా చూడ్డం, ఆ మేరకు ప్రజలకు సహకరిస్తూ, తగిన సదుపాయాలు ఇస్తూ, ప్రశాంత వాతావరణాన్ని కల్పించడం అన్నది ప్రభుత్వ విధి. కాని, చంద్రబాబు  ప్రభుత్వాన్ని వాడుకుని తన ప్రభుత్వ సిబ్బంది, పోలీసుల చేతే ఏకంగా రిగ్గింగ్‌ చేయించారు. మరి దీన్ని ఎన్నిక అని ఎలా అనగలుగుతాం?  ఓట్లను రిగ్గింగ్‌ చేయగలరేమో కాని, ప్రజల హృదయాలను కాదని చెప్పుకొచ్చారు. 

ఎన్నికలు జరుగుతున్న ప్రతి గ్రామంలోకి, సుమారు 200 మంది చొప్పున బయట ప్రాంతాలకు చెందిన టీడీపీ వాళ్లు యథేచ్ఛగా చొరబడి, తెల్లవారుజామునుంచే ఓటర్లను బయటకు రానివ్వకుండా దిగ్బంధించి, బూత్‌లను ఆక్రమించుకున్నారు. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని, బయట ప్రాంతాలకు చెందిన తమ టీడీపీ నాయకులతో, కార్యకర్తలతో ఓట్లేయించారు. వైయస్సార్‌సీపీకి చెందిన ఏజెంట్లు బూత్‌ల్లో కనీసం కూర్చోనీయలేదు, ఓటర్లను బూత్‌లవైపునకు రానీయకుండా ఎక్కడికక్కడ భయపెట్టారన్నారు.   స్వేచ్ఛగా ప్రజలు ఓట్లేయడానికి కాపలాకాయాల్సిన డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ఇతర పోలీసులు, చంద్రబాబుగారి తప్పుడు ఆదేశాలకు తలొగ్గుతూ, టీడీపీ వాళ్లు చేసే దాడులు, దౌర్జన్యాలకు దగ్గరుండి కాపలా కాశారన్నారు. 

అసలు చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓట్లేస్తారు? ఆయన ఏం మంచి చేశాడని ఓట్లేస్తారు.ఏ ఇంటికి వెళ్లినా చంద్రబాబునాయుడును, ఆ పార్టీకి చెందిన వారికి, ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రజలు రివర్స్‌లో ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సుమారు రూ.19వేల కోట్ల మేర కరెంటు ఛార్జీలతో బాదుడే బాదుడు. మరోవైపు మట్టి, ఇసుక, సిలికా, క్వార్ట్జ్‌, లెటరైట్‌, లిక్కర్‌, చివరకు కరెంటు కొనుగోలు ఒప్పందాలు, లంచాల కోసం శెనక్కాయలకు, బెల్లాలకు భూములు అప్పనంగా ఇవ్వడం మొదలు, మొబలైజేషన్ అడ్వాన్స్‌ల పేరిట పనులు జరక్కుండానే, రేట్లు పెంచి ఇవ్వడం మొదలు, రాజధాని నిర్మాణాల పేరిట విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారన్నారు. పోనీ తనకే ప్రజలు ఓట్లేస్తారని అనుకున్నప్పుడు చంద్రబాబుగారు, ఇన్ని దౌర్జన్యాలు, అరాచకాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? తనకే ఓట్లేస్తారని అనుకున్న‌ప్పుడు, ఆ ధైర్యం, నమ్మకం ఉన్నప్పుడు నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకునేలా ఓటర్లను స్వేచ్ఛగా వదిలేసేవారు కదా అని ప్రస్నించారు.  

2017 నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో కూడా చంద్రబాబుగారు ఇదే తరహా కుట్రతో అరాచకాలు చేశారు. ప్రతి వీధికో ఎమ్మెల్యేను పెట్టారు, ప్రతి వార్డుకో మంత్రిని పెట్టి, విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారు. ఆ రోజు ఆ ఉప ఎన్నికల్లో 27వేల ఓట్లతో గెలిచామంటూ సంబరాలు చేసుకున్నారు, మా పార్టీ పనైపోయిందని, జగన్‌ పని అయిపోందని టీడీపీకి చెందిన ప్రతి ఒక్కరితోనూ మాట్లాడించారు. ఏడాదిన్నర తర్వాత జరిగిన అదే నంద్యాల ఎన్నికల్లో వైయస్సార్‌సీపీ 34,560 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చంద్రబాబుగారి పార్టీ పూర్తిగా క్లీన్‌బౌల్డ్ అయ్యింది. అవ్వాళ్టి ఎన్నికతో పోలిస్తే ఇవాళ పులివెందుల ఈ రెండు ZPTC ఉప ఎన్నికల్లో అంతకుమించి అరాచకాలు చేశారు. 2019 తరహాలోనే భవిష్యత్తులోకూడా అదే స్థాయిలో పులివెందుల సహా రాష్ట్ర ప్రజలు కచ్చితంగా స్పందించి, చంద్రబాబుకు బుద్ధిచెప్తారని చాలెంజ్ చేశారు.