Super Six flop: అట్టర్ ఫ్లాప్ సినిమాలకు సక్సెస్ మీట్లు పెట్టినట్లుగా సూపర్ సిక్స్ ఫ్లాప్ అయినా సూపర్ హిట్ అని సభలు పెట్టుకుంటున్నారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. తాడేపల్లిలో జరిగిన ప్రెస్‌మీట్‌లో కూటమి ప్రభుత్వం.. వైఫల్యాలు , అవినీతిని, మోసపూరిత వాగ్దానాలు చేసిందని ఆరోపిస్తూ సుదీర్ఘంగా మాట్లాడారు. రైతుల సమస్యలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం, సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికలలో అక్రమాలు వంటి అంశాలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
రైతులను మోసం చేశారని ఆరోపణ
కూటమి ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేసిందని, ఎరువుల సరఫరాలో అవకతవకలు, బ్లాక్‌మార్కెట్ దందాలు జరుగుతున్నాయని ఆరోపిచారు. రైతు భరోసా, సున్నా వడ్డీ పథకాలను రద్దు చేసి, ఆర్బీకేలు, ఈ-క్రాపింగ్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఉల్లి, టమాటా, చీనీ రైతుల దుస్థితిని ఎత్తిచూపుతూ, ధరల స్థిరీకరణ కోసం చేసిన హామీలను అమలు చేయలేదన్నారు. యూరియా సరఫరాలో రూ.250 కోట్ల స్కామ్ జరిగిందని, టీడీపీ నేతలు ఎరువులను బ్లాక్‌మార్కెట్‌లో అమ్ముతున్నారని ఆరోపించారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ
వైఎస్సార్‌సీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించామని 800 కొత్త సీట్లను తీసుకొచ్చామని జగన్ అన్నారు. అయితే చంద్రబాబు ఈ ప్రాజెక్టులను నిలిపివేశారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తోందని, ఇది పేదలకు అందుబాటులో ఉండాల్సిన వైద్య సేవలను దెబ్బతీస్తుందన్నారు. పులివెందుల మెడికల్ కాలేజీకి 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరైనా, చంద్రబాబు వాటిని తిరస్కరించారని, ఇది పేదలకు వైద్య విద్య అవకాశాలను అడ్డుకోవడమేనన్నారు.
ఆరోగ్యశ్రీ నిర్వీర్యం
ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని, ప్రైవేట్ ఆస్పత్రులు ఈ పథకం కింద వైద్యం అందించడం మానేశాయన్నారు. రూ.4,500 కోట్ల బకాయిలలో కేవలం రూ.600 కోట్లు మాత్రమే చెల్లించారని, దీంతో ప్రజలకు ఉచిత వైద్యం అందడం లేదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో మందులు, టెస్టులు లేకపోవడం వల్ల వైద్య వ్యవస్థ దిగజారిందని విమర్శలు గుప్పించారు.
సూపర్ సిక్స్ హామీలు ఫ్లాప్
చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు తల్లికి వందనం, ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, ఉచిత సిలిండర్లు అన్నీ అబద్ధాలని, ఒక్కటి కూడా సరిగ్గా అమలు కావడం లేదు. ఐదు లక్షల పెన్షనర్లకు కోత విధించారని, రూ.3 వేల నిరుద్యోగ భృతి, రూ.36 వేల ఆడబిడ్డ నిధి వంటి హామీలు గాలికొదిలేశారన్నారు. సూపర్ సిక్స్‌ను “అట్టర్‌ఫ్లాప్ సినిమా”గా అభివర్ణిస్తూ, బలవంతంగా విజయోత్సవాలు చేస్తున్నారని విమర్శించారు.
అంతటా అవినీతి
ఇసుక, లిక్కర్, అమరావతి పేరిట మాఫియా దందాలు నడుస్తున్నాయని, రాష్ట్ర ఆదాయం తగ్గుతుండగా, చంద్రబాబు , ఆయన అనుచరుల సంపద పెరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా కొనసాగుతోందని, ప్రభుత్వ ఆస్తులను అమ్ముకుంటూ ప్రజల ఆస్తులను దోచుకుంటున్నారన్నారు.
చంద్రబాబు బావిలో దూకాలన్న జగన్
చంద్రబాబు చిత్తశుద్ధి లేని నాయకుడని, ప్రజల బాగోగుల కంటే సొంత సంపద పెంచుకోవడంపై దృష్టి పెట్టారని ఆరోపణ.రాష్ట్రాన్ని తిరోగమనంలోకి నడిపిస్తున్నారని, ప్రజల జీవితాలు దిగజారుతుంటే “రోమన్ చక్రవర్తి నీరోలా ఫిడేల్ వాయిస్తున్నారని” విమర్శించారు. ఆయన బావిలో దూకి చావాలన్నారు.
ప్రతిపక్ష నేత హోదా ఎందుకు ఇవ్వట్లేదో చెప్పాలి !
అసెంబ్లీకి రాకపోతే అనర్హతా వేటు వేస్తామని డిప్యూటీ సీఎం రఘురామ చెబుతున్నారు కదా.. అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వట్లేదో ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తాను కోర్టుకు వెళ్లానని.. కోర్టుకు సమాధానం చెప్పాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఇష్టానుసారం చేస్తామంటే కుదరదన్నారు.