Jagan criticizes Chandrababu approach to medical colleges: మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వైసీపీ అధినేత జగన్ ఖండించారు.  మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్‌  కాలేజీలను   కేబినెట్లో  ప్రైవేటు పరం చేయాలని నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.  మా 5 ఏళ్ల అతికొద్దికాలంలో మేము పెట్టిన 17 కాలేజీల్లో 5 చోట్ల కాలేజీలు పూర్తై, క్లాసులు కూడా ప్రారంభం అయ్యాయి. ఎన్నికలు ముగిశాక మరో చోట అడ్మిషన్లు కూడా జరిగాయి. మిగిలిన పనులు మీరు బాధ్యతగా ముందుకు తీసుకెళ్లి ఉంటే,  గత ఏడాది మరో 5, ఈ ఏడాది మరో 7 కాలేజీల్లో కూడా క్లాసులు స్టార్ట్‌ అయ్యేవన్నారు.   మా ప్రభుత్వం వచ్చేనాటికి రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్‌ సీట్లు 2,360. ఈ కొత్త మెడికల్ కాలేజీల ద్వారా సీట్లు మరో 2,550 పెరిగి, 4,910కి చేరుకుంటాయి. మేం పూర్తిచేసి, క్లాసులు ప్రారంభించడంతో కొత్తగా సుమారు 800 సీట్లు భర్తీ కూడా అయ్యాయి. వైద్య విద్యలో ఇదొక అద్భతమైన కార్యక్రమం అయినప్పుడు దీన్ని దెబ్బతీయడం ఎంతవరకు సమంజసమని జగన్ ప్రశ్నించారు.  అత్యాధునిక వైద్యానికి చిరునామాగా నిలిచిన కాలేజీల్లో సగం సీట్లు ఉచితంగానూ, మరో సగం సీట్లు ప్రైవేటు వాళ్లతో పోలిస్తే తక్కువ ఫీజుతోనూ విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి కదా? కళ్లముందే ఫలితాలు కనిపిస్తున్నా, ఈ కాలేజీలను ఎందుకు నాశనం చేస్తున్నారని ప్రశ్నించారు.  పులివెందుల కాలేజీకి NMC మెడికల్‌ సీట్లు ఇస్తే, వద్దంటూ మీరు లేఖ రాసినప్పుడే మీ కుట్ర ఏంటో బయటపడిందన్నారు. 

ప్రతి జిల్లాలోనూ వైద్య ఆరోగ్య రంగంలో, ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వరంగం కూడా ఉండాలని,  అప్పుడే, అక్కడే ఈ కొత్త కాలేజీల వల్ల అందుబాటులోకి వచ్చే ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, పీజీ స్టూడెంట్లు, వివిధ రంగాల్లో ఫ్యాకల్టీలు, సూపర్‌ స్పెషాల్టీ సేవల కారణంగా మంచి మెడికల్ విద్యతోపాటు, ప్రజలకు కూడా వైద్యం ఉచితంగా అందుబాటులో ఉంటుందని, అంతేకాకుండా ప్రభుత్వ రంగం, ప్రైవేటు ఆస్పత్రులు, ఈ రెండూ సమతుల్యతతో, స్వయం సమృద్ధితో పనిచేస్తాయన్న కనీస జ్ఞానం లేకుండా, లంచాలకోసం, కమీషన్ల కోసం కక్కుర్తితో ప్రజల ఆస్తులను ఇలా మీ వాళ్లకు పందేరం చేస్తారా అని మండిపడ్డారు. 

 రాష్ట్ర ప్రజలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీని కూడా మీరు బతకనివ్వలేదని ఆరోపించారు.  15 నెలల్లో రూ.4,500 కోట్లకు గాను, కేవలం రూ.600 కోట్లు మాత్రమే ఇచ్చి, దాదాపు రూ.4,000 కోట్లు ఎగ్గొట్టి, పేదవాడి ఆరోగ్య భద్రతను భ్రష్టు పట్టించారు. వైద్యం ఖర్చు రూ.వేయి దాటితే, 3,257 ప్రొసీజర్లకు ఉచిత వైద్యం అందించేలా, రూ.25 లక్షల వరకూ ప్రభుత్వమే ఉచితంగా భరించేలా ప్రజలకోసం తీసుకు వచ్చిన  గొప్ప ఆరోగ్యశ్రీని నాశనం చేశారన్నారు.  ఆరోగ్యశ్రీ బాధ్యత నుంచి మీరు త‌ప్పుకుని ప్రైవేటుకు ఇవ్వడం, అదో ఘనకార్యంగా ప్రచారం చేయించుకోవడం సిగ్గుగా లేదా? మా ప్రభుత్వ హయాంలోనే సంవత్సరాదాయం రూ.5లక్షల లోపు ఉన్నవారందరికీ వర్తింపు చేయడం ద్వారా మొత్తంగా రాష్ట్రంలో 95% కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగిందన్నారు.  

ఒక బాధ్యతగా ప్రభుత్వం చేసే పనికీ, ప్రైవేటు కంపెనీలు చేసే పనికీ తేడా ఉంటుంది.. దేశంలో అనేక ఆరోగ్య బీమా సంస్థల నుంచి క్లెయిముల పరిష్కారంలో వస్తున్న ఇబ్బందులు తెలియనివా? లాభాలు లేకుండా వారు ఇన్సూరెన్స్‌ వ్యాపారం చేస్తారా అని ప్రశ్నించారు.   ఇన్ని పాపాలు చేస్తున్న మిమ్మల్ని ప్రజలు క్షమించరని హెచ్చరించారు.