IT Raids In YSRCP MLA house : గుంటూరు తూర్పు  వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబ సభ్యుల ఇళ్లల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముస్తఫా, ఆయన సోదరుడు మహ్మద్ కర్నూమ కలిసి వ్యాపారాలు నిర్వహిస్త ఉంటారు. కార్యకలాపాలన్నీ  కర్మూమ నిర్వహిస్తూ ఉంటారు పొగాకు ఎగుమతి  వ్యాపారంలోనూ వారు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కర్నూమ  అంజుమన్ కమిటి అధ్యక్షుడుగా ఉన్నారు.  అధికార పార్టీ నేత ఇంట్లో ఐటీ సోదాలతో తీవ్ర కలకలం రేగుతోంది. కొంత మంది పొగాకు వ్యాపారుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. పొగాకు కొనుగోళ్లు పొగాకు బోర్డు ద్వారానే జరగాలి. అయితే కొంత మంది వ్యాపారులు ప్రవేటుగా రైతుల వద్ద నుంచి కొనుగోలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి.                               


ఈ ఆరోపణలతో సోదాలు నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఓ పొగాకు బోర్డు సభ్యుడి ఇంట్లోనూ  సోదాలు నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా.. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుతో  కలిసిప౧గాకు ఎగుమతి వ్యాపారాన్ని గతంలో చేసినట్లుగా ప్రచారం ఉంది. ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన వ్యాపారాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. అదేసమయంలో ఇటీవల ఆయనకు చెందిన ఓ గోడౌన్‌లో గుట్కా తయారు చేస్తూ కొంత మంది పట్టుబడ్డారు. అయితే కేసుల్లో ఎవరి పేర్లూ బయటకు రాలేదు. ఆ కేసుల విచారణ కూడా తేలలేదు.                              


మహమ్మద్ ముస్తఫా  గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 2014, 2019 ఎన్నికల్లో ముస్తఫా వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఈ సారి ఎన్నికల్లో మాత్రం తాను నిలబడబోనని.. తన కూతురు పోటీ చేస్తుందని ఇప్పటికే ముస్తఫా ప్రకటించారు. గతంలో ముఖ్యమంత్రి జగన్ తమ నియోజకవర్గానికి వచ్చిన నేపథ్యంలో ఆయనకు ముస్తఫా తన కుమార్తెను పరిచయం చేశారు. రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయం నుంచి ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమా రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. తండ్రితో పాటుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు అవుతున్నారు. వారసురాలిని బరిలోకి దింపి తాను రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్న సమయంలో .. ఆయనపై ఐటీ దాడులు జరగడం సంచలనంగా మారింది.                                


ఏపీలో అధికార పార్టీ నేతలపై ఇటీవలి కాలంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి  పెట్టలేదు. ఇప్పటి వరకూ ఎవరిపైనా సోదాలు జరగలేదు. తెలంగాణలో మాత్రం విస్తృతంగా సోదాలు జరుగుతున్నాయి. ప్రతీ వారం ఓ ఇరవై, ముఫ్భై బృందాలతో కీలక కంపెనీలపై సోదాలు జరుగుతూ ఉంటాయి. తొలి సారి ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యే కుటుంబసభ్యుల ఇంట్లో సోదాలు చేయడం వెనుక రాజకీయంగా ఏమైనా పరిణామాలు దాగి ఉన్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.