Special Temple In Nallamala Forest: కేవలం పెద్ద పులుల శృంగారం కోసం మూడు నెలల పాటు మూసి ఉంచే అరుదైన ఆలయం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. దీనిని "ఇష్ట కామేశ్వరి " దేవాలయం గా పిలుస్తారు. శ్రీ శైలానికి 20కిమీ దూరం లోని "ఇష్ట కామేశ్వరి " ఆలయం చాలా అరుదైనది. దట్టమైన నల్లమల అడవుల్లో ఉండే ఈ ఆలయాన్ని జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకూ మూసివేసి ఉంచుతారు. నల్లమల లోని పెద్దపులల సంయోగం కావడం తో వాటికి ఎలాంటి అలికిడి ఉండకుండా ఫారెస్ట్ అధికారులు ఏటా ఈ నిర్ణయం తీసుకుంటారు.
ఆ దారి ఒక అద్భుతం..ఆ ప్రయాణం ఒక సాహసం
శ్రీ శైలం ఆలయానికి 20 కిమీ దూరం లో ఉంటుంది ఈ "ఇష్ట కామేశ్వరి "ఆలయం. పూర్తిగా దట్టమైన నల్లమల అడవుల్లో ఎంతో సాహసోపేతంగా ప్రయాణిస్తే ఈ ఆలయం చేరుకోగలం. కొన్నేళ్ల క్రితం వరకూ ఒకరిద్దరు మినహా మిగిలిన వాళ్ళు ఈ ఆలయానికి వెళ్లేవారు కాదు. ప్రత్యేకించి దారంటూ ఏమీ ఉండేది కాదు. ఈ మధ్యకాలంలో శ్రీశైలం నుంచి కొన్ని జీపులు "ఇష్ట కామేశ్వరి "ఆలయం వరకూ వెళుతున్నాయి. " నెక్కంటి జంగిల్ రైడ్" గా పిలిచే ఈ టూర్ లో శ్రీ శైలం శిఖరదర్శనం పూర్తయ్యాక ఈ గుడి వరకు వెళ్లే భక్తులు ఎవరైనా ఉంటే వాళ్లని తమ జీపుల్లో ఎక్కించుకొని దర్శనానికి తీసుకువెళ్తారు. అయితే జీపు నిండే వరకు భక్తులు ఎదురుచూడాల్సి ఉంటుంది .
శ్రీశైలం నుంచి డోర్నాల రూట్ లో 13 కిలోమీటర్లు ప్రయాణించాక అక్కడ ఫారెస్ట్ అధికారులు చెక్ చేసి జీపులను దట్టమైన అడవిలోకి వదులుతారు. అక్కడి నుంచి ఏడు కిలోమీటర్ల పాటు సరైన దారిలో లేని అటవీ మార్గంలో జీపులు వెళతాయి. ఆ దారిలో ప్రకృతి అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ గతుకులు, రాళ్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జీపులు కుదుపులకు లోనవుతాయి. అందుకే వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు ఈ రూట్లో వెళ్లకపోవడం మంచిది. జీపులు ఆగిపోయిన తర్వాత అక్కడ నుంచి ఒక కిలోమీటర్ పాటు ఆలయం వరకు నడవవలసి ఉంటుంది. అలా నడుస్తూ ఉంటే దూరంగా సెలయేళ్లు పారుతున్న శబ్దాలు, వన్యప్రాణుల అరుపులు వినిపిస్తూ ఉంటాయి.
ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఒక కిలోమీటర్ నడిచాక చెంచుగూడాల మధ్య ఒక గుహ లాంటి ప్రదేశంలో అమ్మవారి విగ్రహం ఉంటుంది. దీపపు వెలుగుల్లో చెంచులు ఆమెను కొలుస్తూ ఉంటారు. నాలుగు భుజాలతో, చేతిలో త్రిశూలం తో ఉండే ఈ అమ్మవారు తొలినుంచి గిరిజనుల పూజలు అందుకుంటూ వస్తోంది. "ఇష్టకామేశ్వరి" దేవత కు భారతదేశంలో ఇదొక్కటే ఆలయం అని కూడా చెబుతూ ఉంటారు.. ఈ దారిలో రాత్రిపూట వాహనాలను వెళ్ళనివ్వరు.
జులై 1 నుంచి మూడు నెలలు ఆలయం మూసివేత
ఏటా జూలై 1 నుంచి ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్లే దారిని మూసివేస్తూ ఉంటారు. నల్లమల పెద్ద పులులకు ఆవాసం. నాగార్జున సాగర్ శ్రీ శైలం టైగర్ రిజర్వ్ గా పిలిచే ఈ అరణ్యం లో తాజా లెక్కల ప్రకారం 87 పెద్ద పులులు ఉన్నాయి. జూలై - సెప్టెంబరు మధ్య అవి సంభోగం లో పాల్గొంటాయి. కాబట్టి వాటి ఏకాంతానికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండడానికి సెప్టెంబర్ నెలాఖరు వరకూ " ఇష్ట కామేశ్వరి ఆలయం " రూట్ ను మూసి వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. మళ్లీ అప్పటి వాతావరణ పరిస్థితులను బట్టి అక్టోబర్ మొదటి వారంలో ఈ ఆలయ మార్గాన్ని తిరిగి భక్తులకు అందుబాటులోకి తెస్తారు.