Breaking News Live: ఏపీలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత, మాస్క్ మస్ట్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ బదిలీ అయ్యారు. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రవీణ్ ప్రకాశ్‌ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనాను రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ప్రవీణ్ ప్రకాశ్ ను బదిలీ చేస్తూ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీలో నైట్‌కర్ఫ్యూ తొలగింపు. మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం ఆదేశం. కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
ఫీవర్ సర్వే కొనసాగించాలి. ఆరోగ్యశాఖలో రిక్రూట్‌మెంట్ ను పూర్తిచేయాలి సీఎం జగన్ ఆదేశం
కృష్ణాజిల్లా జిల్లా విస్సన్నపేట కలగరలో విషాదం నెలకొంది. కారుమంచి శివ, బన్ను దంపతుల రెండు సంవత్సరాల తేజస్వినికి పుట్టినరోజు వేడుకలను జరుపుతుండగా భోజనాలు జరిగే ప్రాంతంలో కూర్చీలో కూర్చుని ఆడుకుంటూ తేజస్విని సాంబార్ గిన్నెలో పడిపోయింది. వెంటనే చిన్నారిని తిరువూరు పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం తేజస్విని చనిపోయింది. పసిపాప మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటనలో అడ్డంకుల పర్వం కొనసాగుతోంది. మంత్రిని అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు స్టేషన్ కు తరలించారు. అనంతరం బీజేపీ నాయకులు కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకోవడానికి యత్నించారు. దీంతో పోలీసులు బీజేపీ నాయకులను కూడా అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. దీంతో ఉద్రిక్తతల నడుమ మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 18న మేడారం జాతరకు వెళ్లనున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ కేసీఆర్ మేడారం పర్యటన గురించి తెలిపారు. మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఇప్పటికే మంత్రులు తెలిపారు. జాతరకు అన్ని వర్గాల ప్రజలకు సహరించాలని కోరారు. రాజకీయాలతో సంబంధం లేకుండా జాతరను అన్ని వర్గాల వారు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మేడారం వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా 34 పార్కింగ్ ప్లేస్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులకు ఎక్కడా ఏ సమస్య రాకుండా చూసేందుకు జాతరలో మొత్తం 40 వేల మంది సిబ్బంది విధుల్లో ఉంటారని మంత్రులు తెలిపారు.
హైదరాబాద్ నగరంలోని హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహబూబ్ ఖురేషీ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అనంతరం పరారయ్యాడు. రెండు రోజుల క్రితం అజిజియా మసీద్ దగ్గర మహబూబ్ ఖురేషీ కొత్తగా ఓ మటన్ షాపు తెరిచాడు. అయితే, గతంలో ఈ దుకాణం నడిపించిన వారే దాడి చేసినట్లుగా బాధిత ఖురేషి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దుకాణం యజమాని, నిందితుడి మధ్య ఉన్న గొడవ కారణంగా ఖురేషిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Govt of India to ban 54 Chinese apps that pose a threat to India’s security: 54 చైనా యాప్స్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించనుంది. దేశ భద్రత నేపథ్యంలో అనుమానిత యాప్‌లపై నిషేధం విధించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. బ్యాన్ విధించిన యాప్‌లలో బ్యూటీ కెమెరా: స్వీట్ సెల్ఫీ హెచ్‌డీ (Beauty Camera: Sweet Selfie HD), బ్యూటీ కెమెరా - సెల్ఫీ కెమెరా (Beauty Camera - Selfie Camera), ఈక్వలైజర్ అండ్ బాస్ బూస్టర్, క్యామ్ కార్డ్ ఫర్ సేల్స్‌ఫోర్స్ ఎంటర్‌టైన్మెంట్, ఐసోలాండ్ 2: యాషెస్ ఆఫ్ టైమ్ లైట్, వివా వీడియో ఎడిటర్, టెన్సెంట్ గ్జిరైవర్, ఆన్‌మ్యోజీ చెస్, ఆన్‌మ్యోజీ అరెనా, యాప్ లాక్, డ్యూయస్ స్పేస్ లైట్ వంటి యాప్ లు ఉన్నాయి.
నల్గొండలో అక్రమంగా నిల్వ ఉంచిన 100 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. టేకులసోమారం గ్రామానికి చెందిన కిరాణా షాపు నడుపుతున్న కుడితాల వెంకటేశం పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆ గ్రామ పరిధిలో ఓ వ్యక్తి ఇంటి వద్ద బియ్యం నిల్వలు ఉన్నట్లు సమాచారం అందింది. ఆ మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దీంతో అక్కడ వంద క్వింటాళ్ల క్వింటాళ్ల బియ్యాన్ని గుర్తించారు. వ్యాపారి వెంకటేశంపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆదిలాబాద్‌లో కడుపు నొప్పి భరించలేక ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం మండలంలోని సిద్దూర్ గ్రామంలో ఆందోళ్ల నరేష్(32) కొన్నేళ్లుగా కడుపు నొప్పితో బాధపడున్నాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. భార్య శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ పోలీసులు తెలిపారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Background
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణంలో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కనిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గే అవకాశం ఉంది. తూర్పు దిశ నుంచి గాలుల ప్రభావం తగ్గగా, మరోవైపు ఈశాన్య దిశ నుంచి గాలులు తక్కువ ఎత్తులో వేగంగా వీస్తున్నాయి. దీని ఫలితంగా ఏపీ మరో మూడు రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. చలి తీవ్రత కాస్త పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు నేడు ఎలాంటి వర్ష సూచన లేదు. జంగమేశ్వరపురంలో అత్యల్పంగా 15.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కళింగపట్నంలో 15.9 డిగ్రీలు, నందిగామలో 17.1 డిగ్రీలు, బాపట్లలో 19.7 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఎలాంటి సమస్యలు లేవని వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్ని చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగడంతో వాతావరణం కాస్త వేడిగా మారనుంది. వర్ష సూచన లేకపోవడంతో రైతులు ధాన్యం విషయంలో ఆందోళన చెందవద్దని అధికారులు పేర్కొన్నారు.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో నేడు తేలికపాటి జల్లులు కురవనున్నాయి. ఈ ప్రాంతాల్లో నేడు కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకావం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో అనూహ్యంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యవరంలో ఏకంగా 17 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అనంతపురంలో 18.6 డిగ్రీలు, కర్నూలులో 19.2 డిగ్రీలు, తిరుపతిలో 19.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తాంధ్రతో పోల్చితే రాయలసీమలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నాయి.
తెలంగాణలో చలి
తెలంగాణలో ఆకాశాన్ని మేఘాలు కప్పేస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం వేళ పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలు ఉండగా, పగటి వేళ గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా నమోదు కానున్నాయి. తెలంగాణలో తూర్పు దిశ నుంచి ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వర్షాలు లేకపోయినా కనిష్ట ఉష్ణోగ్రతలు అంతగా పెరగడం లేదు.
బంగారం వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా నేడు స్వల్పంగా పెరిగింది. గ్రాముకు రూ.1 చొప్పున పెరిగింది. అంతకుముందు రోజు ఏకంగా రూ.100 ఎగబాకింది. వెండి ధర మాత్రం నేడు స్థిరంగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.46,810 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,060 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.67,400గా నిలకడగా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,810 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,060గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.67,400 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.46,810 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,060గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.67,400గా ఉంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -