టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు జైలు నుంచి.. ఏపీ ప్రజలు, టీడీపీ శ్రేణులకు బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులతో ములాఖత్ సందర్భంగా చంద్రబాబు తన అభిప్రాయాలు, ఆలోచనలను రాష్ట్ర ప్రజలకు లేఖ రాయాలని కోరారు. దీంతో.. ఆయన చెప్పిన అంశాలను పొందుపరిచి బాబు పేరిట కుటుంబ సభ్యులు లేఖను విడుదల చేశారు. ఈ లేఖ చదివిన తెలుగు ప్రజలు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు.


స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి, గత నెల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలుగు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. నా ప్రియాతి ప్రియమైన తెలుగు ప్రజలందరికీ నమస్కారాలు అంటూ లేఖ ప్రారంభించారు. ప్రస్తుతం ఈ లేఖపై ఏపీ లో పెద్ద దుమారమే నడుస్తోంది.


ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఈ లేఖపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక సోషల్ మీడియాలో అయితే.. టీడీపీ వర్సెస్ వైసీపీగా పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడ చూసినా ఈ లేఖ గురించే చర్చ సాగుతోంది. ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న బాబు.. జైలులో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజల గురించే ఆలోచిస్తున్నారంటూ సామాన్యుడు సైతం చెబుతున్న పరిస్థితి. సామాజిక మాద్యమాల్లో తెగ వైరల్ అవుతున్న ఈ కరపత్రంపై రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు స్పందించారు. ఈ మేరకు జైలు సూపరిడెంట్ ఓ ప్రకటనను విడుదల చేశారు.


మాకు సంబంధం లేదు


‘చంద్రబాబు సంతకంతో కరపత్రం జైలు నుంచి జారీ చేయబడలేదు. ఆయన సంతకంతో విడుదలైన కరపత్రంనకు.. జైలుకు ఏవిధమైన సంబంధం లేదు. కారాగార నియమావళి ప్రకారం ముద్దాయిలు ఎవరైనా సంతకం చేయబడిన కరపత్రములు బయటికి విడుదల చేయదలిచినచో.. సదరు పత్రమును జైలు అధికారులు పూర్తిగా పరిశీలించి దాన్ని జైలరు దృవీకరించి సంతకం, కారాగార ముద్రతో సంబంధిత కోర్టులకు లేదా ఇతర ప్రభుత్వ శాఖలకు, కుటుంబ సభ్యులకు పంపబడును. కావున చంద్రబాబు కరపత్రనకు, ఈ కారాగారమునకు ఏ విధమైన సంబంధం లేదని తెలియజేయుచున్నాం’ అని రాజమండ్రి జైలు పర్యవేక్షణాధికారి రాహుల్ ప్రకటనలో పేర్కొన్నారు.


లోకేష్ కన్నెర్ర


ఈ లేఖ వ్యవహారంపై టీడీపీ యువనేత నారా లోకేష్ స్పందించారు. ‘జగన్ జమానాలో లేఖ రాయడం కూడా దేశ ద్రోహమా?. నిబంధనలకు విరుద్ధంగా పెన్ కెమెరాతో వీడియోలు తీసి ఇచ్చినప్పుడు అధికారులకు జైలు నిబంధనలు గుర్తుకు రాలేదా?. చెయ్యని తప్పుకి 44 రోజులుగా జైలులో బంధించారు. ములాఖత్‌లో భాగంగా ఆయన ప్రజలతో చెప్పాలి అనుకున్న అంశాలు అన్ని మాతో పంచుకున్నారు. ప్యాలెస్ ఆదేశాలకు భయపడి లేఖ రాయడం కూడా నేరం అన్నట్టు పోలీసులు పత్రికా ప్రకటన విడుదల చేయడం రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులను తలపిస్తోంది. నాలుగు గోడల మధ్య నిర్బంధించినా జగన్ కి కక్ష తీరలేదు. ఆఖరికి ఆయనకు లేఖ రాసే హక్కు కూడా లేదంటూ వేధిస్తున్నారు’ అని జైలు అధికారులు, జగన్ సర్కార్‌పై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.