Sonia To Idupulapaya : వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇడుపులపాయకు వస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. వారి సెక్యూరిటీ సిబ్బంది కూడా ఇడుపులపాయకు వచ్చారని చెబుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఎనిమిదో తేది. ఇటీవల షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని దానికి సంబంధించిన ప్రకటన ఇడుపులపాయలోనే వస్తుందని చెబుతున్నారు. కానీ ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు మాత్రం అలాంటి సమాచారం ఏమీ మీడియాకు ఇవ్వడం లేదు. అలాంటి కార్యక్రమం ఉన్నట్లుగా ఎలాంటి సమాచారం లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఇడుపుల పాయకు సోనియా రావడం లేదన్న చింతామోహన్
ఏపీ కాంగ్రెస్ నేతలకు కూడా ఎలాంటి సమాచారం లేరు. ఇడుపులపాయకు సోనియా వస్తుందన్న- ప్రచారం అంతా అవాస్తవమేనని ఏపీ కాంగ్రెస్ పార్టీ కీలక నేత చింతా మోహన్ ప్రకటించారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి వస్తే మంచిదేనన్నారు. అయితే ఆమెకు అంతహైప్ ఇవ్వాల్సిన పని లేదు.. రాజశేఖర్ రెడ్డినిప్రజలు ఎప్పుడో మర్చిపోయారని ఆయనంటున్నారు.
షర్మిల పార్టీ విలీనం ప్రచారంతో సోనియా ఇడుపుల పాయ రాక వార్తలు
వైఎస్ చనిపోయిన తర్వాత వారి కుటుంబం అంతా కాంగ్రెస్ పార్టీతో విభేదించి .. వైసీపీ ని పెట్టుకున్నారు. అప్పట్నుంచి వైఎస్ జయంతిని కూడా కాంగ్రెస్ నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే ఇటీవల జగన్ కుటుంబంలో వివాదాలు ప్రారంభం కావడంతో షర్మిల సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలనుకుంటున్నట్లుగాప్రచారం జరుగుతోంది. తెలంగాణలో అధికారాన్ని సొంతం చేసుకోవాలని పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ అవసరం అయితే తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సేవలను కూడా ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల కర్ణాటకకు చెందిన కొంతమంది ఆ పార్టీ నేతలు ఆ దిశగానే షర్మిలతో చర్చలు జరిపినట్లు సమాచారం.
ఏపీలో రాజకీయం చేయాలంటున్న కాంగ్రెస్ - తెలంగాణలోనేనంటున్న షర్మిల
అయితే కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలను తెలంగాణలో కాకుండా ఏపీలోనే రాజకీయాలు చేయాలని సూచిస్తున్నట్లుగా చెబుతున్నారు. కానీ షర్మిల మాత్రం .. వైసీపీకి నష్టం జరగకుండా ఏపీలో మాత్రం రాజకీయాలు చేయాలనుకోవడం లేదని చెబుతున్నారు. తెలంగాణకే పరిమితమవుతానని వాదిస్తున్నారు. అలా అయితే .. షర్మిల పార్టీని విలీనం చేసుకోవాల్సిన అవసరం లేదని.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు హైకమాండ్‌కు సలహా ఇస్తున్నారు. ఆమె వల్ల తెలంగాణ పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు.