YSRCP : ఏపీలో టీడీపీ నేతలు వైఎస్ఆర్‌సీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని, హత్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఇరవై నాలుగో తేదీన ఢిల్లీలో ధర్నా చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఈ ధర్నాలో పాల్గొంటారు. రాష్ట్రాల శాంతిభద్రతల అంశంపై ఢిల్లీలో ధర్నాచేయడం వెనుక జగన్ వ్యూహం ఉందని భావిస్తున్నారు. ఇరవై రెండో తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాలకు హాజరయ్యే ఉద్దేశం లేనందునే ఇలా సమావేశాల సమయంలోనే ఢిల్లీలో ధర్నా ప్రకటించారని చెబుతున్నారు.
అసెంబ్లీకి హాజరయ్యేందుకు జగన్ విముఖం
అసెంబ్లీకి హాజరయ్యే విషయంలో జగన్మోహన్ రెడ్డి డైలమాలో ఉన్నారు. ప్రమాణ స్వీకార సమయంలో ఆయన వెంటనే వెళ్లిపోయారు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నికకు కూడా హాజరు కాలేదు. స్పీకర్ ఎన్నిక సంప్రదాయాన్ని ఆయన పాటించలేదు. తర్వాత తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ కు లేఖ రాశారు. అలా ఇస్తేనే వస్తానన్నట్లుగా ఆయన లేఖ రాశారు. కానీ టీడీపీ నేతలు మాత్రం సీరియస్ గా స్పందించారు. తాము కాదు అసలు ప్రజలే ఇవ్వలేదన్నారు.
శ్వేతపత్రాలు ప్రకటించి విచారణలకు ఆదేశించే అవకాశం
ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల సమయం గడువు దగ్గర పడింది. సాధారణంగా కొత్త ప్రభుత్వం ఏర్పడితే తొలి సమావేశాల్లో గత ప్రభుత్వం చేసిన తప్పులను అసెంబ్లీలో ప్రస్తావించడం ఖాయం. జగన్మోహన్ హయాంలో లెక్కలేనంతగా ఆర్థిక దోపిడి, విధ్వంసం జరిగిందని ఆరోపిస్తున్న టీడీపీ వాటిని అసెంబ్లీలో ప్రజెంట్ చేసి విచారణలకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకు ముందే శ్వేతపత్రాలు ప్రకటించనున్నారు. అలాంటి సమయంలో తాము అసెంబ్లీలో ఉండటం ఇబ్బందికమేనని వైసీపీ అధినేత భావిస్తున్నారు. పైగా తమ వాయిస్ వినిపించడానికి సంఖ్యాబలం ప్రకారం చూస్తే చాలా తక్కువ సమయం లభిస్తుంది.
వ్యూహం ప్రకారమే నిర్ణయం
ఇవన్నీ ఆలోచించేఅసెంబ్లీకి వెళ్ల కూడదని జగన్ భావిస్తున్నారు. అయితే పారిపోయినట్లుగా ఉండకూడదన్న ఉద్దేశంతో.. వినుకొండలో జరిగిన హత్య ఘటన కేంద్రంగా రాజకీయం చేసి.. అసెంబ్లీ సమావేశాల సమయంలో.. ఢిల్లీలో ధర్నాను ప్రకటించినట్లుగా భావిస్తున్నారు. పనిలో పనిగా ఏపీలో పరిస్థితి బాగోలేదని దేశం దృష్టికి తీసుకెళ్లినట్లుగా ఉంటుందన్న అంచనాలో ధర్నా ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
గవర్నర్ ప్రసంగం సమయంలో ఆందోళన చేసి సస్పెండ్ కావడమో లేదా బాయ్ కాట్ చేయడమో చేయాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లినా ప్రయోజనం ఉండదని మాట్లాడేందుకు అవకాశం ఇవ్వరని అంచనా వేస్తునన్నారు. అందుకే ఎమ్మెల్యేలు కూడా హజరయ్యే విషయంలో జగన్ విముఖంగా ఉన్నారని భావిస్తున్నారు.