Ips Transfers : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో భారీగా ఐపీఎస్ లు బదిలీ అయ్యారు. రైల్వే పోలీస్ (Railway Police) అదనపు డీజీగా కుమార్ విశ్వజిత్ (Kumar Viswajith) బదిలీ అయ్యారు. ఎస్ఎల్పీఆర్బీ ఛైర్మన్ గా ఉన్న అతుల్ సింగ్ (Atul Singh)... ఏపీఎస్పీ అడిషనల్ డీజీగా నియమించారు. సీఐడీ విభాగం ఐజీగా ఉన్న సీహెచ్ శ్రీకాంత్... అక్టోపస్ కు బదిలీ అయ్యారు. రోడ్ సేఫ్టీ అథారిటీ ఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి వరకు అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఎస్వీ రాజశేఖర్ బాబును ఎస్ఎల్పీఆర్బీ ఛైర్మన్ గా ప్రభుత్వం బదిలీ చేసింది. హోం గార్డ్స్ ఐజీగా అదనపు బాధ్యతలు ఇచ్చింది. ఇంటెలిజెన్స్ ఐజీ ఉన్న కొల్లి రఘురామిరెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఐజీగా నియమించింది. అంతేకాకుండా డ్రగ్స్ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. 


సీఐడీ బాధ్యతలు సర్వశ్రేష్ట త్రిపాఠికి 


సర్వశ్రేష్ట త్రిపాఠికి సీఐడీ బాధ్యతలు అప్పగించింది. విశాఖపట్నం డీఐజీ హరిక్రిష్ణను పోలీసు సిబ్బంది వ్యవహారాల ఐజీగా నియమించింది. టెక్నికల్ సర్వీసెస్ ఐజీగా అదనపు బాధ్యతలు ఇచ్చింది. విశాఖపట్నం శాంతిభద్రతల డీసీపీగా సీహెచ్ మణికంఠ, ఏపీఎస్పీ ఐదో బెటాలియన్ కమాండెంట్ గా అధిరాజ్ సింగ్ రాణా, కాకినాడ మూడో బెటాలియన్ కమాండెంట్ గా క్రిష్ణకాంత్ పటేల్, గుంటూరు ఎస్పీగా తుషార్, జగ్గయ్యపేట డీసీపీగా కె శ్రీనివాసరావు, రంపచోడవరం ఏఎస్పీగా కె ధీరజ్, పాడేరు ఏఎస్పీగా ఏ జగదీశ్, విజయవాడ డీసీపీగా ఆనంద్ రెడ్డిలను నియమించింది. 


 బదిలీలు, పోస్టింగులపై మార్గదర్శకాలు జారీ
రెండు మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections 2024), అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉన్నతాధికారుల బదిలీలు, పోస్టింగులపై మార్గదర్శకాలు గతంలోనే జారీ చేసింది. ఎన్నికలతో సంబంధమున్న అధికారులు సొంత జిల్లాలో ఉండకూడదని, దీర్ఘకాలంగా ఒకేచోట ఉన్నవారు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని ఆదేశాలు ఇచ్చింది. మూడేళ్లుగా ఒకే జిల్లాలో ఉన్న వారిని కొనసాగించవద్దని స్పష్టం చేసింది. 2024 జూన్ ఆఖరుకు మూడేళ్లు పూర్తయ్యేవారిని కొనసాగించొద్దని హెచ్చరించింది. బదిలీలు, పోస్టింగుల విషయంలో అలసత్వం వహించవద్దని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం  రాష్ట్రాల సీఈవోలు, సీఎస్‌లకు ఈ ఆదేశాలు జారీ చేసింది. 


జనవరి 31కి బదిలీలు పూర్తి చేయాల్సిందే
బదిలీలు, పోస్టింగ్‌ల ప్రక్రియను 2024 జనవరి నెలాఖరుకి పూర్తిచేసి, నివేదికను సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో మూడేళ్లు పూర్తి చేసుకున్నఅధికారులను బదిలీ చేసింది. అదనపు డీజీపీ నుంచి ఎస్సై వరకూ పోలీసుశాఖలో బదిలీలు చేపట్టనున్నారు. అదనపు డీజీపీలు, ఐజీలు, డీఐజీలు, ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, ఆర్‌ఐలకు ఈ బదిలీలు వర్తించనున్నాయి. ఎక్సైజ్‌ శాఖలో ఎస్సై, అంతకంటే పై స్థాయి అధికారులకు ఈ నిబంధనలు వర్తింపచేసింది. జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా ఉప ఎన్నికల అధికారులు, ఆర్‌వోలు, జాయింట్‌ కలెక్టర్లు, ఆర్డీవోలు, సబ్‌కలెక్టర్లు, తహసీల్దార్లు అధికారులకు ఈ బదిలీల నిబంధన వర్తించనుంది.