AP Elections 2024: విజయవాడ: ఏపీ రాజకీయాల్లో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu)తో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ కావడం సంచలనంగా మారింది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు కోసం ప్రశాంత్ కిశోర్ (Prashanth Kishore) వ్యూహకర్తగా పనిచేస్తారని ప్రచారం జరిగింది. ఐప్యాక్ టీమ్ వైసీపీతో తెగదెంపులు చేసుకుందని, వచ్చే ఎన్నికల్లో ఏపీ పాలిటిక్స్ మరింత ఆసక్తికరంగా మారతాయని పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ అయింది. కానీ చంద్రబాబు, పీకే సుదీర్ఘ భేటీ అనంతరం ఐప్యాక్ సంస్థ స్పందించింది. వచ్చే ఎన్నికల్లోనూ తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేసింది.
వైసీపీతో కలిసి పనిచేస్తాం - ఐప్యాక్
గత ఏడాది నుంచి ఐప్యాక్ సంస్థ వైసీపీతో కలిసి పనిచేస్తుందని టీమ్ తెలిపింంది. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ విజయం సాధించేందుకు తమ సంస్థ విశ్రాంతి లేకుండా పనిచేస్తుందని సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఏపీ ప్రజల జీవితాలను మెరుగు పరిచేందుకు జగన్ ను మరోసారి ఎన్నికల్లో గెలిపించి అధికారంలోకి తెస్తామని ఐప్యాక్ సంస్థ క్లారిటీ ఇచ్చింది.
కాగా, ఐప్యాక్ ను స్థాపించింది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. ఆయన ఐప్యాక్ నుంచి బయటకు వచ్చినట్లు గతంలోనే ప్రకటించారు. రాబిన్ శర్మ, శాంతను సింగ్, ప్రశాంత్ కిశోర్ కలిసి ఐప్యాక్ సంస్థను ప్రారంభించిన సభ్యులు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా ఐప్యాక్ నుంచి వచ్చారు. ప్రస్తుతం టీడీపీకి షో టైమ్ కన్సల్టింగ్ అనే సంస్థ పనిచేస్తోంది. రాబిన్ శర్మ టీమ్ టీడీపీకి ఎన్నికల కోసం పనిచేస్తోంది. అయితే శనివారం ప్రత్యేక విమానంలో నారా లోకేష్‌తో కలిసి ప్రశాంత్ కిశోర్ విజయవాడ వచ్చి .. నేరుగా వెళ్లి చంద్రబాబుతో సమావేశం అయ్యారు. అది మొదలుకుని ఐప్యాక్ టీమ్ వైసీపీకి గుడ్ బై చెప్పి, చంద్రబాబుతో చేతులు కలిపిందని ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన ఐప్యాక్ టీమ్ తాము వైసీపీతో ఉన్నామని, వచ్చే ఎన్నికల్లో జగన్ ను అధికారంలోకి తీసుకురావడమే తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేసింది.
మరోవైపు ఏపీ మంత్రులు పీకే, చంద్రబాబు భేటీపై సెటైర్లు వేస్తున్నారు. ఎంత మంది పీకేలు వచ్చినా జగన్ ను ఏం చేయలేరని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. కోడి కత్తి, బాబాయి హత్య లాంటి ప్లాన్స్ ఇచ్చిన పీకేతో చంద్రబాబు కలిశారని మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్ చేయగా.. టీడీపీ నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కోడి కత్తి, బాబాయి మర్డర్ ప్లాన్ గురించి ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు అని సెటైర్లు వేస్తున్నారు.