అనకాపల్లి: నిరుద్యోగ యువతను ఉద్యోగాల పేరిట విదేశాలకు పంపించేందుకు ఎంప్లాయిమెంట్ ఏజెన్సీలు నకిలీ రిక్రూట్మెంట్ (Fake Recruitment) ద్వారా మధ్య పెట్టి, మోసం చేస్తున్న ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తన నియోజకవర్గం అనకాపల్లి, రాయలసీమ ప్రాంతం కడప జిల్లాలో సైతం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అనకాపల్లి ఎంపీ డాక్టర్ సి.ఎం. రమేష్ తెలిపారు. ఎక్కువ మంది యువత మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి వెళ్లడానికి ఉత్సాహంగా ఉంటున్నారు. కానీ ఏజెన్సీల మోసానికి గురవుతున్నారు. వారికి జరిగినది అన్యాయం అని తెలుసుకున్నాక ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ మోసాలను, ఘటనలను అరికట్టడానికి, నియంత్రించడానికి ఏదైనా యంత్రాంగం ఉందా? అని సీఎం రమేష్ పార్లమెంట్ లో ప్రశ్నించారు. దానిపై కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందని సభలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సమాధానం ఇచ్చారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (NDA) ప్రభుత్వ హయాంలో గల్ఫ్ దేశాలతో భారత్ సంబంధాలు మెరుగుపడ్డాయని జయశంకర్ తెలిపారు. యూఏఈ లాంటి దేశాన్ని తీసుకుంటే, ఆ దేశ విదేశాంగ మంత్రి ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారని వెల్లడించారు. భారత ప్రధానులెవరూ గతంలో యూఏఈ కి వెళ్లిన దాఖాలాలు లేవని, నేడు గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న భారతీయుల ప్రస్తుత స్థితిగతులు చాలా బాగున్నాయని చెప్పారు. అక్కడి మన పౌరుల బాగోగులు చూసుకునేందుకు ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గల్ఫ్ దేశాలతో భారత్ సంబంధాలు మెరుగుపడ్డాయనే విషయం దేశ ప్రజలు గమనించాలని మంత్రి జయశంకర్ అన్నారు.
ఇక ఉపాధి కోసం రిక్రూటింగ్ ఏజెన్సీల ద్వారా చట్ట విరుద్ధంగా లేదా నిబంధనలకు విరుద్ధంగా మిడిల్ ఈస్ట్ ప్రాంతాలకు వెళ్లి నట్టైతే ఇమ్మిగ్రేషన్ చట్టం 1983 ప్రకారం విదేశాంగ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి జయశంకర్ తెలిపారు. ఈ విషయాలపై అనకాపల్లి ఎంపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.