Independence Day 2021 in AP Live: జెండా ఆవిష్కరించిన సీఎం జగన్.. పోలీసుల నుంచి గౌరవ వందనం
75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆంధ్రప్రదేశ్ ఘనంగా నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు.
తమ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి వ్యవసాయ రంగంపై రూ.83 వేల కోట్ల వ్యయం చేసిందని సీఎం జగన్ తెలిపారు. రైతులకు పగటిపూటే నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. ప్రతి రైతుకు పెట్టుబడి భరోసా కింద ఏటా రూ.13,500 అందిస్తున్నట్లు చెప్పారు. పెట్టుబడి సాయం కింద రైతులకు ఇప్పటిదాకా రూ.17 వేల కోట్లు అందజేశామని చెప్పారు. 31 లక్షల మంది రైతులకు వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమా అందించామని చెప్పారు. ధాన్యం కొనుగోలు సేకరణ కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్పారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని ప్రసంగంలో సీఎం జగన్ అన్నారు.
కర్నూల్ పోలీస్ గ్రౌండ్‌లో 75వ స్వాతంత్ర దినోత్సవంలో రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. జెండా ఆవిష్కరించిన ఆయన అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
‘‘రూ.3,669 కోట్ల ఖర్చుతో ‘నాడు-నేడు’ కింద మొత్తం 15,715 పాఠశాలల రూపు రేఖలు మార్చాం. జగనన్న విద్యా కానుక కింద రూ.1,400 కోట్లు విద్యార్థుల కోసం ఖర్చు చేశాం. జగనన్న అమ్మ ఒడి పథకం కింద ఇప్పటివరకు రూ.13,023 కోట్లను విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో వేశాం. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 8.71 లక్షల డ్వాక్రా బృందాలకు రూ.6,792 కోట్లను అందజేశాం.’’ అని జగన్ ప్రసంగించారు.
ప్రసంగంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రైట్ టూ ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా రైట్ టూ ఇంగ్లీష్ మీడియం ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. అర్హులైన పేదలకు సొంత ఇల్లు హక్కుగా ఉండాలని ఆకాంక్షించారు. 26 నెలల కాలంలో అనేక పథకాలు అనేక కార్యక్రమాలు అమలు చేశామని గుర్తు చేశారు.
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు. జెండా వందనం తర్వాత సాయుధ దళాల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాల ప్రదర్శననను సీఎం ఆసక్తిగా తిలకించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగిస్తున్నారు.
మరోవైపు, తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం కూడా స్వాతంత్ర వేడుకలకు ముస్తాబైంది. రంగురంగుల విద్యుత్ ధగధగలతో కాంతులీనుతోంది. ఆదివారం ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది ఈ వేడుకలు జరపనున్నారు. కరోనా నేపథ్యంలో అతి కొద్దిమంది మాత్రమే ఈ వేడుకలో పాల్గొననున్నారు.
Background
ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్ర వేడుకలు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలు జరగనున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారు. అంతేకాక, ఈ వేడుకల్లో వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రభుత్వ పథకాలను ప్రతిబింబించేలా వాటిని రూపొందించారు. కరోనా మార్గదర్శకాల వల్ల పరిమిత సంఖ్యలోనే జనాన్ని అనుమతించారు.
Also Read: Independence Day 2021 Telangana Live: స్వాతంత్ర వేడుకలకు గోల్కొండ సిద్ధం.. జెండా ఎగరేయనున్న కేసీఆర్
- - - - - - - - - Advertisement - - - - - - - - -